ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. 5 జట్లతో వచ్చే ఏడాది మార్చిలో పురుషుల ఐపీఎల్‌కు ముందు మహిళల టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. 5 జట్లు మిగిలిన టీమ్‌లతో లీగ్ దశలో రెండు సార్లు తలపడతాయని తెలిపింది. ఈ లీగ్ దశలో 20 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుందని... 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నట్లు వెల్లడించింది. ప్రతి ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ప్లేయర్లు మించకుండా గరిష్ఠంగా 18 మందిని తీసుకోవచ్చని తెలిపింది. ప్రతి టీంలోని తుది జట్టులో ఐదుగురికి మించి విదేశీ ప్లేయర్లు ఉండకూడదని నిబంధన పెట్టింది.
దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు జరగనున్న మహిళ టీ-ట్వంటీ ప్రపంచకప్ తర్వాత ఈ టోర్నీని నిర్వహించాలని భావిస్తోంది. ఐదారు జట్లతో పురుషుల టోర్నమెంట్ లాగా రోజూ మ్యాచ్‌లు జరపడం సాధ్యం కాదని పేర్కొంది. అలాగే మ్యాచ్ వేదికలను రోజూ మార్చడం వీలు కాదని తెలిపింది. ఇందుకోసం లీగ్ దశలోని తొలి 10 మ్యాచ్‌లను ఒక వేదికపై... మిగితా 10 మ్యాచ్‌లను మరో మైదానంలో నిర్వహించాలని భావిస్తోంది. ఫ్రాంఛైజీలను జోన్‌ల వారీగా విక్రయించనున్నట్లు సమాచారం. ప్రతి జోన్‌కు సంబంధించి రెండు నగరాలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నార్త్ జోన్‌లో ధర్మశాల లేదా జమ్ము... వెస్ట్ జోన్‌లో పుణె లేదా రాజ్‌కోట్... సెంట్రల్ జోన్‌లో ఇండోర్ లేదా నాగ్‌పూర్‌లేదా రాయ్‌పూర్... ఈస్ట్ జోన్‌లో రాంచీ లేదా కటక్.... సౌత్ జోన్‌లో కొచ్చి లేదా వైజాగ్... నార్త్-ఈస్ట్ జోన్‌లో గువాహటి పేర్లను పరిశీలనలోకి తీసుకోనున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి వేదికల్లోనే మహిళల ఐపీఎల్ టోర్నీని జరపాలని బోర్డు నిర్ణయించింది. మహిళల ఐపీఎల్‌కు సంబంధించి అన్ని విషయాలపై తుది నిర్ణయం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ ఆఫీస్ బేరర్లదేనని బోర్డు స్పష్టం చేసింది. 2017 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన తర్వాత మహిళల ఐపీఎల్ నిర్వహించాలనే వాదన పెద్దఎత్తున తెరపైకి వచ్చింది. మహిళలకు ఐపీఎల్ నిర్వహిస్తే భారత్‌లో క్రికెట్‌కు మరింత ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 2016నుంచి ఆస్ట్రేలియాలో మహిళల బిగ్ బాష్ లీగ్ కొనసాగుతుండగా... గతేడాది ఇంగ్లండ్‌లో హండ్రెడ్ లీగ్ ప్రారంభించారు. వచ్చే ఏడాది పాకిస్థాన్ కూడా మహిళల లీగ్ ప్రారంభించనున్నట్లు పేర్కొంది.