క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం నిర్ణయించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో (ECB) చర్చల అనంతరం స్టేడియం కెపాసిటీలో 60 శాతం మందికి అనుమతివ్వనున్నట్లు తెలుస్తోంది.
భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ తొలి దశలో అభిమానులు లేకుండానే మ్యాచ్లు జరిగాయి. కరోనా రెండో దశను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 29 మ్యాచ్ల తర్వాత పలువురు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో టోర్నీని వాయిదా వేయాల్సి వచ్చింది.
సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ రెండో దశ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది. టోర్నీలో భాగంగా సీఎస్కే, ముంబయి ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే దుబాయ్ చేరుకుంది.
ఇదీ చదవండి: రాహుల్పై బీరు కార్క్స్.. ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం