అభిమానులను ఉర్రూతలూగిస్తూ ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టి మజానందించిన ఐపీఎల్ 13వ సీజన్ ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ముంబయి ఇండియన్స్. ఫలితంగా మరే జట్టుకు లేని తిరుగులేని రికార్డుల్ని ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో రోహిత్‌సేన ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.
క్వాలిఫయిర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై దిల్లీ క్యాపిటల్స్ గెలుపొందడం వల్ల శ్రేయస్ సేన తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తుదిపోరులో శ్రేయస్ సేనపై ఐదు వికెట్ల తేడాతో ముంబయి ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ముంబయి ఫైనల్లో విజేతగా నిలిచిన మ్యాచ్‌లను గుర్తు చేసుకుందాం.
సీఎస్కేతో ఫైనల్ (2013)
ఇది సచిన్ తెందూల్కర్ చివరి ఐపీఎల్ సీజన్. 2010లో ముంబయి ఇండియన్స్ తొలిసారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ గెలవలేకపోయింది. 2013 సీజన్ మధ్యలో యువ క్రికెటర్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించి సచిన్‌కు ఘన వీడ్కోలు పలికింది జట్టు.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 10 ఓవర్లలో 52/4తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అప్పుడు బరిలో దిగిన ఆల్‌రౌండర్ పొలార్డ్ తన విరోచిత పోరాటంతో ముంబయి స్కోరు బోర్డు 148/9కి చేర్చాడు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉండటం వల్ల లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్‌ల వంటి పేసర్లను బరిలో దించింది ముంబయి. ఫలితంగా సీఎస్కే 7 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 36 పరుగులు చేసింది. చెన్నై కెప్టెన్ ధోనీ చివరి వరకు పోరాడినా.. 23 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది.
సీఎస్కేతో రెండో ఫైనల్ (2015)
ఐపీఎల్-2015 సీజన్‌ను ముంబయి ఇండియన్స్ పేలవంగా ప్రారంభించింది. మొదటి 7 మ్యాచ్‌ల్లో 5 ఓడి పాయింట్ల పట్టికలో చివరిస్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లలో ముంబయి తన అద్భుత పోరాటంతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరింది. దీంతో ఆ ఏడాది జరిగిన క్వాలిఫయర్-1లో చెన్నైని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సీఎస్కే గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ముంబయి బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో ముంబయి బౌలర్లు విజయం సాధించారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్‌కింగ్స్ 161 రన్స్ చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ముంబయి ఇండియన్స్ ఐపీఎల్లో రెండోసారి విజేతగా నిలిచింది.
రైజింగ్ పుణెతో ఫైనల్ (2017)
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ లీగ్ దశ నుంచే అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయిర్-1లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ చేతిలో పరాజయం చవిచూసిన తర్వాత.. క్వాలిఫయిర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన పుణె జట్టు కూడా బ్యాటింగ్‌లో విఫలమైంది. పుణె బ్యాట్స్‌మెన్‌ను ముంబయి బౌలర్లు కట్టడి చేసి 20 ఓవర్లలో 128 పరుగులకే పరిమితం చేశారు. ఫలితంగా 1 పరుగు తేడాతో రోహిత్ సేన గెలుపొంది మూడోసారి విజేతగా నిలిచింది.
సీఎస్కేతో ఫైనల్ (2019)
ఈ సీజన్ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇందులో ఓడి క్వాలిఫయర్-2కు చేరిన ధోనీసేన.. దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి.. 8వ సారి ఐపీఎల్ ఫైనల్ చేరింది. చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన 4వ ఫైనల్ మ్యాచ్ ఇది.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టుకు ఓపెనర్లు క్వింటన్ డికాక్, పొలార్డ్ గొప్ప ఆరంభాన్నిచ్చారు. దీంతో రోహిత్‌సేన నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 1 పరుగు తేడాతో ముంబయిపై పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ విరోచిత పోరాటం వృథా అయ్యింది. ఈ గెలుపుతో ముంబయి ఇండియన్స్ నాలుగోసారి విజేతగా నిలిచింది.
దిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్ (2020)
ఐపీఎల్-13వ సీజన్‌ను యూఏఈ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి నిర్వహించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బయో-బబుల్‌ను ఏర్పాటు చేసి టోర్నీని జరిపారు. ముంబయి ఇండియన్స్ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్.. లీగ్ దశలోనే వైదొలగింది. ఈ సీజన్లో అనూహ్యాంగా దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. దిల్లీ జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించి.. ఐదోసారి విజేతగా నిలిచింది. దిల్లీ విధించిన 157 పరుగుల లక్ష్య ఛేదనలో సారథి రోహిత్ 68 పరుగులతో జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు.