ఐపీఎల్ 13వ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ముంబయి ఇండియన్స్-దిల్లీ క్యాపిటల్స్ తుదిపోరుకు సిద్ధమయ్యాయి. దీంతో పర్పుల్, ఆరెంజ్ క్యాప్లపైనా ఓ స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం దిల్లీ బౌలర్ రబాడ పర్పుల్ క్యాప్‌తో ఉండగా.. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు.
పర్పుల్ క్యాప్
సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో మెరిసిన దిల్లీ బౌలర్ రబాడ.. పర్పుల్ క్యాప్‌ను బుమ్రా నుంచి తిరిగి లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో లీగ్‌లో ఇతడి వికెట్ల సంఖ్య 29 (16 మ్యాచ్‌లు)కి చేరింది. బుమ్రా 14 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆరెంజ్ క్యాప్
పంజాబ్ సారథి కేఎల్ రాహుల్(670 పరుగులు) అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. సన్‌రైజర్స్-దిల్లీ మ్యాచ్‌లో 78 పరుగులతో మెరిసిన ధావన్(603 పరుగులు).. ఈ సీజన్లో 600 పరుగుల మార్కును అందుకున్నాడు. మంగళవారం జరగబోయే ఫైనల్లో మరో 64 పరుగులు సాధిస్తే ఆరెంజ్ క్యాప్‌ను ధావన్ చేజిక్కించుకునే వీలుంది.