భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించి రాజస్థాన్ రాయల్స్ విజయానికి బాట వేసిన బెన్ స్టోక్స్, సంజూ శాంసన్‌ను కొనియాడాడు ముంబయి ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టుకు 60 పరుగులు జోడించిన హార్ధిక్.. సిక్సర్లు బాదడం అంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు.
"సిక్సర్లు కొట్టడం బాగా ఆనందాన్నిస్తుంది. రెండో సారి టైం ఔట్ విరామం వచ్చినప్పుడు ఉన్న మా జట్టు స్కోర్‌ను బట్టి అంతిమంగా 160-170 పరుగులు లక్ష్యంగా ఉంచాలని భావించాం. కానీ, అనుకున్న లక్ష్యానికి 25 పరుగులు ఎక్కువగానే చేశాం. బెన్ స్టోక్స్, సంజూ ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. రాజస్థాన్ విజయంలో వారి పాత్ర కీలకం."
- హార్ధిక్ పాండ్యా, ముంబయి జట్టు ఆల్ రౌండర్.
కొన్నిసార్లు మనం ప్రత్యర్థి జట్టు ఆటను కూడా ప్రశంసించాలి అని హార్ధిక్ అన్నాడు. స్టోక్స్, శాంసన్ బ్యాటింగ్ చేసిన తీరు తనకు అద్భుతంగా అనిపించిందని పేర్కొన్నాడు. ముంబయి బౌలర్లకు మరో అవకాశమే లేకుండా లక్ష్యాన్ని ఛేదించారని కొనియాడాడు.
అబుదాబి వేదికగా ముంబయితో తలపడ్డ రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 195 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. హార్ధిక్ 21 బంతుల్లో 60 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ప్రత్యర్థి జట్టు ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
ఇదీ చదవండి:ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్