యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ముంబయి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోగా మిగిలిన 3 స్థానాల కోసం చెన్నై తప్ప మిగతా జట్లు పోటీపడుతున్నాయి. అయితే, ఈ సీజన్ తొలి సగంలో అలరించిన బెంగళూరు, దిల్లీ జట్లు.. ఇటీవల వరుస ఓటములతో విఫలమవుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. గత మూడు మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లూ అటు పెద్ద స్కోర్లు సాధించలేకపోయాయి. ఇటు ప్రత్యర్థుల వికెట్లూ పడగొట్టలేకపోయాయి. ఈ క్రమంలోనే ఘోర ఓటములు చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి.
దిల్లీపై గెలవాల్సిందే!
కోహ్లీసేన గత మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్, ముంబయి, చెన్నై జట్లతో ఓటమిపాలైంది. ఈ మూడింటిలో ఆ జట్టు స్కోర్లు 120, 164, 145 పరుగులే. గత ఆదివారం చెన్నైపై.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(50), ఏబీ డివిలియర్స్(39) రాణించినా ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో విఫలమయ్యారు. టాప్ ఆర్డర్‌లో ఫిలిప్, పడిక్కల్ ఫర్వాలేదనిపిస్తున్నా తర్వాత వచ్చే వీరిద్దరూ ధాటిగా ఆడలేకపోతున్నారు. ఇక మిడిల్ ఆర్డర్‌లో బెంగళూరు పరిస్థితి ఆశాజనకంగా లేదు. శివమ్ దూబె, క్రిస్ మోరిస్ అస్సలు ప్రభావం చూపలేకపోతున్నారు. సోమవారం దిల్లీతో తలపడే చివరి మ్యాచ్‌లో కోహ్లీ, డివిలియర్స్ బ్యాట్లు ఝుళిపించకపోతే ఆ జట్టు పరిస్థితి సంక్లిష్టంగా మారనుంది. దిల్లీపై గెలిస్తేనే నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.
బౌలింగ్‌లో తడబాడు
బెంగళూరు బౌలింగ్ యూనిట్‌లో చాహల్ ఒక్కడే నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. మధ్య ఓవర్లలో తన స్పిన్ మాయాజాలంతో పరుగుల వేట తగ్గిస్తున్నా జట్టును గెలిపించే స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాడు. సిరాజ్, నవ్‌దీప్ సైనీ, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ అడపాదడపా వికెట్లు తీస్తున్నారు. పంజాబ్‌పై చెలరేగిన సిరాజ్ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో వీళ్లు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే సోమవారం మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్ దంచికొడితే మళ్లీ కష్టాలు తప్పకపోవచ్చు.
దిల్లీ టాపార్డర్‌కు ఏమైంది?
దిల్లీ ఈ సీజన్ తొలి సగంలో వరుస విజయాలతో దూసుకుపోయింది. ఒకదశలో అగ్రస్థానంలో నిలిచి కచ్చితంగా ఫైనల్ చేరేలా కనిపించింది. అయితే, గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడం వల్ల ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకునేలా కనిపిస్తోంది. బెంగళూరు లాగే ఇది కూడా ఇటీవల తక్కువ స్కోర్లకే పరిమితమవుతోంది. ప్రధానంగా టాప్ ఆర్డర్ విఫలమవ్వడమే కారణంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా పృథ్వీషా, అజింక్యా రహానె, ఏ మాత్రం రాణించలేకపోతున్నారు. ధావన్ అంతకుముందు రెండు వరుస శతకాలు బాదినా చివరి మూడు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా పెద్ద స్కోర్లు సాధించలేకపోతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో హెట్‌మైయిర్, స్టొయినిస్ కూడా విఫలమవుతున్నారు.
బౌలింగ్‌లో మెరుగవ్వాలి
దిల్లీ జట్టులో బౌలింగ్ యూనిట్ కూడా చాలా బలమైనదే. రబాడ ఇప్పటికే అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో వికెట్లేమీ దక్కలేదు. అలాగే నోకియా నిలకడగా రాణిస్తున్నాడు. మధ్యలో అశ్విన్, అక్షర్ పటేల్ ఒక్కోసారి పరుగులు నియంత్రిస్తున్నా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టలేకపోతున్నారు. దాంతో మధ్య ఓవర్లలో ప్రత్యర్థులు తేలిగ్గా పరుగులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిల్లీ చివరి మ్యాచ్‌లో చెలరేగాలంటే బౌలర్లు లయ అందుకోవాలి. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తే ప్లేఆఫ్స్‌లో నేరుగా స్థానం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు.