అంతర్జాతీయ క్రికెట్లో అతిగొప్ప ఫినిషర్లలో మహేంద్రసింగ్ ధోనీ ఒకడు. టాప్ నుంచి మిడిలార్డర్ వరకు ఎక్కడైనా ఆడే సత్తా ఉంది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆడిన రెండు మ్యాచుల్లో మాత్రం లోయర్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగాడు. యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్, రవీంద్ర జడేజాను ముందుగా పంపించాడు. చాలామంది దీనిని మహీ అద్భుత వ్యూహంగా విశ్లేషించారు. రాజస్థాన్ చేతిలో ఓటమి తర్వాత అతడు అసలు కారణం చెప్పాడు.
విరామం కారణంగా
14 రోజుల క్వారంటైన్ తన సన్నద్ధతపై ప్రభావం చూపించిందన్న ధోనీ.. సాధనకు అవసరమైన సమయం దొరకలేదని పేర్కొన్నాడు. అందులోనూ ఏడాది కాలం బ్యాటు పట్టుకోకపోవడం వల్ల దిగువ ఆర్డర్‌లో వస్తున్నానని చెప్పాడు. దుబాయ్ వచ్చిన కొన్నిరోజులకు చెన్నై శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి కొవిడ్-19 సోకడం వల్ల ఎక్కువ రోజులు నిర్బంధంలోనే ఉన్నారు.
షార్జా వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. స్మిత్ బృందం నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోనీ క్రీజులోకి వచ్చినప్పటికీ ఆఖరి వరకు షాట్లేమీ బాదలేదు. అతడిలో మునుపటి ఊపు కనిపించలేదు. కేవలం సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. చివరి ఓవర్లో మాత్రం మూడు సిక్సులు కొట్టాడు.
"217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే మాకు శుభారంభం అవసరం. కానీ అది దక్కలేదు. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ అద్భుతంగా ఆడారు. రాజస్థాన్ బౌలర్లనూ మెచ్చుకోవాల్సిందే. తొలి ఇన్నింగ్స్ చూశాక బంతుల్ని ఏ విధంగా వేయాలో తెలుస్తుంది. వారి స్పిన్నర్లూ రాణించారు. బ్యాట్స్‌మెన్‌కు దూరంగా బంతులు విసిరారు. మా వాళ్లు మాత్రం తప్పులు చేశారు. ఎక్కువగా ఫుల్ లెంగ్త్ బంతులు విసిరారు. రాజస్థాన్‌ను 200 స్కోరుకే నియంత్రిస్తే మ్యాచ్ మరోలా ఉండేది"
- మహేంద్రసింగ్ ధోనీ, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్
అయితే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కాకుండా మరికొన్ని రోజుల తర్వాత ఆడేందుకు సీఎస్కేకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. కానీ ధోనీనే ఆ ప్రతిపాదనను కాదన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.