T20 World Cup Squad : ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లు, స్టాండ్‌బైలను పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కలగక మానదు. కొన్నేళ్ల విరామం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తనకు వచ్చిన అవకాశాలను పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. అతడి ప్రదర్శన సాధారణం. అయినా అతను ప్రపంచకప్ జట్టులోకి ఎలా ఎంపికయ్యాడన్నది అర్థం కాని విషయం. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ సైతం అంతగా రాణించింది లేదు. వీళ్లిద్దరితో పోలిస్తే రవి బిష్ణోయ్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఆసియా కప్‌లోనూ ఆడిన ఒక మ్యాచ్‌లో అతను రాణించాడు. చాహల్ రూపంలో జట్టులో మరో లెగ్ స్పిన్నర్ ఉన్నాడని బిష్ణోయ్‌ని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది.
జట్టులో ఒక ఆఫ్‌స్పిన్నర్ ఉండాలని అశ్విన్‌ను, జడేజా దూరమయ్యాడు కాబట్టి ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ఎంపిక చేయాలని అక్షర్‌ను ఎంచుకున్నట్లుందే తప్ప వారి ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. ఇక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్, అనుభవజ్ఞుడు అయిన శ్రేయస్ అయ్యర్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేసి.. దీపక్ హుడాను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హుడా ఐర్లాండ్ లాంటి చిన్న జట్లపై మెరిశాడే తప్ప.. కీలక మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. ఆసియా కప్‌లోనూ విఫలమయ్యాడు. ఆల్‌రౌండర్ కాబట్టి హుడాను ఎంచుకున్నారేమో అనుకుంటే.. అతడికి బౌలింగే ఇవ్వట్లేదు. కేవలం బ్యాట్స్‌మనే కావాలనుకుంటే తన కంటే శ్రేయసే మెరుగు!
ఇక సీనియర్ పేసర్ మహ్మద్ షమి విషయంలో సెలక్టర్ల ఉద్దేశం అంతుబట్టడం లేదు. షమిపై పని భారం ఎక్కువ అవుతుందని, యువ పేసర్లకు అవకాశం ఇవ్వాలని ఇన్నాళ్లూ అతణ్ని పక్కన పెట్టినట్లుగా అనిపించింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు షమిని ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా పెట్టారు. షమిని ప్రపంచకప్‌లో ఆడించాలనుకుంటే ముందు నుంచి జట్టులోకి తీసుకోవాల్సింది. అప్పుడప్పుడూ మ్యాచ్‌లు ఆడించాల్సింది. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ షమి గొప్పగా బౌలింగ్ చేశాడు. మరి అలాంటి బౌలర్‌ను ఇన్నాళ్లూ పక్కన పెట్టి, ప్రపంచకప్ ముంగిట సిరీస్‌లకు ఎంపిక చేయడం, టోర్నీకి స్టాండ్‌బైగా పెట్టడంలో వ్యూహమేంటో అర్థం కాని విషయం. సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడం, గాయం నుంచి కోలుకుని అందుబాటులోకి వచ్చిన దీపక్ చాహర్‌కు సరైన అవకాశాలు ఇవ్వకుండా స్టాండ్‌బైకు పరిమితం చేయడంపైనా క్రికెట్ అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: కోహ్లీ, అనుష్క శర్మ కాఫీ డేట్.. ఫొటోలు వైరల్