IND Vs WI 3rd T20 : వెస్టిండీస్ గడ్డపై టీమ్ఇండియా పరాజయాల పరంపరం కొనసాగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం గయానా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుస పరాజయాలతో చతికిలపడిన టీమ్ఇండియా పంజా విసిరేందుకు సిద్ధమవుతుండగా.. అదే జోరును కొనసాగించి ఆధిక్యాన్ని ట్రిపుల్ చేసుకోవాలని విండీస్ భావిస్తోంది.
వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన టీమ్ఇండియా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. పేలవ బ్యాటింగ్‌తోనే టీమ్ఇండియా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. తెలుగు తేజం తిలక్ వర్మ మినహా మరే ఆటగాడు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిపై వేటు వేసి యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్‌కు చోటిచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే విండీస్ గడ్డపై టెస్ట్‌ల్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. మూడు మ్యాచ్‌ల్లో అదే జోరును కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే జైస్వాల్‌ను జట్టులోకి తీసుకొస్తే ఎవర్నీ పక్కనపెట్టాలా? అనేది ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. శుభ్‌మన్ గిల్‌ను తప్పిస్తే ఓపెనర్లుగా ఇద్దరూ లెఫ్టాండర్లే ఉండనున్నారు. టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ అయిన సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెడితే విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ పరిస్థితుల్లో టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌కు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సంజూ శాంసన్. లేదంటే పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి సూర్యతో యశస్విని ఓపెనింగ్ చేయించడమే. ఏది ఏమైనా మూడో టీ20లో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తుది జట్టులో మార్పులు చేయకుండా బరిలోకి దిగాలని హార్దిక్ పాండ్య భావిస్తే మాత్రం.. మరోసారి నిరాశే ఎదురుకానుంది.
భారత్ తుది జట్టు(అంచనా)
యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్/ఉనాద్కత్, యుజ్వేంద్ర చాహల్