IND VS WI 2023 2nd ODI : వెస్టిండీస్ పర్యటనలో భారత్‌కు భంగపాటు ఎదురైంది. బార్బోడోస్‌లో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియాపై 6 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టు ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగిన భారత్ విండీస్ బౌలర్ల ధాటికి 181 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు ఇషాన్ కిషన్ 55, శుభ్‌మన్ గిల్ 34 పరుగులతో రాణించారు.
అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ కెప్టెన్ షై హోప్ 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కార్టీ 48, కైల్ మేయర్స్ 36 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు..
శార్దూల్ బౌలింగ్‌లో ముగ్గురు.. మోస్తరు లక్ష్యఛేదనను ప్రారంభించిన విండీస్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (15), కైల్ మేయర్స్ పర్వాలేదనిపించేలా ఆడారు. బ్రెండన్ నెమ్మదిగా ఆడినప్పటికీ.. కైల్ మేయర్స్ దూకుడు ప్రదర్శించారు. అయితే దూకుడుగా ఆడిన మేయర్స్‌కు శార్దూల్ ఠాకూర్ అడ్డుకున్నాడు. అతడి బౌలింగ్‌లో షాట్ బాది ఉమ్రాన్ మాలిక్‌కు క్యాచ్ ఇచ్చి మేయర్స్ ఔట్ అయ్యాడు. శార్దూల్ వేసిన ఓవర్లోనే బ్రెండన్ కింగ్ కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మళ్లీ శార్దూల్ బౌలింగ్‌లోనే అథనేజ్ (6) కూడా ఔట్ అయిపోయాడు.
ఆ తర్వాత క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన హెట్మయర్ను(9) కుల్దీప్ యాదవ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. కానీ, అప్పటికే క్రీజులో నిలకడగా ఉన్న షై హోప్.. కార్టీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ ముందుకు వెళ్లాడు. భారత బౌలర్లు వికెట్ కోసం ఎంత ప్రయత్నించినా .. ఈ ఇద్దరూ అస్సలు అవకాశం ఇవ్వలేదు. నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. ఎక్కువగా సింగిల్స్ తీస్తూనే.. అవకాశం దొరికినప్పుడు బౌండరీలు బాదేశారు. హోప్ 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక హార్దిక్ బౌలింగ్‌లో కార్టీ వరుసగా రెండు ఫోర్లు కొట్టేసి విండీస్ జట్టు విజయాన్ని అందించాడు.
ఇదీ చూడండి :
Ashes 2023 : జెర్సీలు మార్చుకొని తికమక పెట్టిన ఆతిథ్య జట్టు.. దీని వెనక అంత కథ ఉందా!