ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ నాటికి భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ పూర్వ వైభవాన్ని సాధిస్తాడని మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. ఇకపోతే ఈ ఏడాది కోహ్లీ ఆట చూడదగినదిగా ఉంటుందని వెల్లడించాడు. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు తక్కువని.. దీంతో అతడు ఫామ్, నిలకడను అందుకొంటాడని విశ్లేషించాడు. కోహ్లీ తనదైన శైలిలో బంతిని బాదడానికి, స్ట్రైక్ రొటేట్ చేయడానికి వన్డేఫార్మాట్ అవకాశం కల్పిస్తుందన్నాడు. అయితే అతడు ఈ వ్యాఖ్యలు చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే విరాట్ తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో శతకం బాది దిగ్గజ క్రికెటర్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
"ఇది 2023. వన్డే ప్రపంచకప్ సంవత్సరం. ఫామ్‌లోకి రావాలనుకునే ఆటగాళ్లకు 50 ఓవర్ల ఫార్మాట్ అద్భుతమైంది. ఈ ఫార్మాట్‌లో ఆడటం రోహిత్ శర్మకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అతడు ఇప్పటికే వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడు. ఈ ఫార్మాట్‌లో దాదాపు 65శాతం పరుగులు సింగిల్స్, డబుల్స్‌లోనే లభిస్తాయి. ఈ రకంగా పరుగులు తీయడానికి కోహ్లీ ఇష్టపడతాడు. ఇది అతడిపై ఒత్తిడి తగ్గిస్తుంది. కోహ్లీ ఫామ్ కోల్పోయాడని చెప్పడం అన్యాయమే అవుతుంది. అతడు జట్టుకు అవసరమైన మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాకపోతే ఆ సమయంలో మూడంకెల స్కోర్‌ను చేరుకోలేదంతే" అని మంజ్రేకర్ విశ్లేషించాడు.
విరాట్ కోహ్లీ చాలా కాలం విరామం తర్వాత గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో శతకం సాధించాడు. కేవలం 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అదే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు లంకతో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ బాదాడు.
ఇదీ చూడండి:
IND VS SL: సెంచరీపై కోహ్లీ రియాక్షన్.. అది తోడుండటం వల్లే జరిగిందటా
IND VS SL: కోహ్లీ సూపర్ సెంచరీ.. రోహిత్ మిస్... సచిన్ రికార్డ్ సమం..