Gill Dengue Fever : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌నకు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమ్‌ఇండియాకు తొలి మ్యాచ్‌కు ముందు షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగీ బారిన పడినట్లు సమాచారం. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై స్పందించిన కోచ్ రాహుల్ ద్రవిడ్.. గిల్ ఈరోజు కాస్త కొలుకున్నాడని తెలిపారు. ఇంకా 36 గంటల సమయం ఉందని.. అప్పటి వరకు వేచి చూస్తామని చెప్పారు. అతడిని జట్టు నుంచి మినహాయించాలని వైద్య బృందం ఇంకా స్పష్టత ఇవ్వలేదని.. ఈక్రమంలోనే చివరి క్షణం వరకు చూస్తామన్నారు. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గురువారం చెన్నైలో చేసిన పరీక్షల్లో డెంగీగా నిర్ధరణ అయినట్లు తెలుస్తోంది. అతడికి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
Gill Dengue Positive : ఈ నేపథ్యంలోనే టీమ్ యాజమాన్యం సైతం ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తోందని తెలుస్తోంది. అందుకోసమే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఆసియా కప్‌తోపాటు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన గిల్ తొలి మ్యాచ్ ఆడకపోతే భారత్‌కు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. జట్టులో గిల్ లేని పక్షంలో ఆసీస్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఉన్నా.. అతడిని మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే భారత జట్టు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం
బ్యాటింగ్ విభాగం
కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ఆటగాళ్ల మార్గదర్శకంలో టీమ్ఇండియా బలంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న కోహ్లీ.. తన శతకాల వేటను కొనసాగించే అవకాశం ఉంది. తన పుల్, కట్ షాట్లతో బౌండరీలు దాటించేందుకు రోహిత్ సైతం సిద్ధంగానే ఉన్నాడు. మిస్టర్ 360గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది.
బౌలింగ్ విభాగం
కొద్ది రోజులుగా తడబాటులో ఉన్న బౌలింగ్ విభాగం పూర్తి సన్నద్ధతతో కనిపిస్తోంది. ఆరు నెలల సుదీర్ఘ విశ్రాంతి అనంతరం టీమ్‌లోకి వచ్చిన స్టార్ బౌలర్ బూమ్రా.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి అదుర్స్ అనిపించాడు. ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తన పరాక్రమాన్ని చూపించిన సిరాజ్.. నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. మహ్మద్ షమీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌తో బౌలింగ్ పటిష్ఠంగా ఉంది. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య కూడా ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
Sri Lanka World Cup 2023 : అనుభవం తక్కువ ప్రదర్శన ఎక్కువ.. ఈ లంక ప్లేయర్ల ఆట అదుర్స్!