ODI World Cup 2023 : అక్టోబర్-నవంబర్ మధ్య భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఉండాల్సిందేనని టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. జట్టు విజయాల్లో స్పిన్నర్లు అత్యంత కీలకపాత్ర పోషిస్తారని ఆయన అన్నాడు.
భారత్‌లోని పిచ్‌లపై మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మిగతా టీమ్‌ల బ్యాటర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందని.. ఇంతకు ముందు 2011 ప్రపంచకప్‌లో కూడా ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశాడు. అందుకనే భారత జట్టులో కీలకంగా ఉన్న సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఈసారి జట్టులో కచ్చితంగా అవకాశం కల్పించాలని కోరాడు. ఈ క్రమంలో చాహల్ బౌలింగ్‌ను ఫేస్ చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని దాదా చెప్పుకొచ్చాడు. జట్టు విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని దాదా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో పాటు రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ వంటి మణికట్టు స్పిన్నర్లను కూడా ఈ మధ్య మెగా టోర్నీల్లో ఆడించడం లేదు. ఇది సరైంది కాదు. చాహల్ ఉంటే మ్యాచ్ ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చేవి. ఏ ఫార్మాట్లోనైనా చాహల్ ప్రదర్శన మాత్రం నిలకడగానే ఉంటుంది. దీని ఆధారంగా ప్రపంచకప్ జట్టు కూర్పు విషయంలో అతడి ఎంపికపై కూడా సెలక్టర్లు దృష్టి పెట్టి.. కచ్చితంగా ఆడించాలి."
- సౌరభ్ గంగూలీ, మాజీ కెప్టెన్
కూర్పు సరైందైతే.. కప్పు మనదే..
Ex Cricketers On India World Cup Win : భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి సంబంధించి షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈసారి కప్పును ఎవరు ఎగరేసుకుపోతారు?.. ఫలానా జట్టులో ఏ ఆటగాళ్లు ఉంటే జట్టుకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. చివరిసారిగా 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్‌కు ఈసారి సొంత గడ్డపై జరిగే మ్యాచ్ అత్యంత కీలకమని.. మళ్లీ కప్పు గెలిచేందుకు ఇదే సరైన సమయమని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. టీమ్ సెలక్షన్ విషయంలో సెలక్టర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తే టోర్నీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ షెడ్యూల్..
ICC World Cup 2023 Schedule : ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ సమరం ప్రారంభం కానుంది. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ పోరుకు సంబంధించిన మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న తలపడనుంది. ఇక అందరికి ఆసక్తిని రేకెత్తించే దాయాదుల పోరు (పాకిస్థాన్-ఇండియా మ్యాచ్) అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది.