పాండ్య సోదరులు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. తమ తండ్రి తమతో లేకున్నా.. ఆయన దుస్తులైనా తమ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌పై విజయం తర్వాత హార్దిక్ తన సోదరుడు కృనాల్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది.
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్ఇండియా దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చి 317 పరుగులు చేసింది. వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ విజృంభించి ఆడాడు. బౌండరీలు బాదేస్తూ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడు 31 బంతుల్లోనే అర్ధశతకం చేయడం గమనార్హం. అంతే కాకుండా బౌలింగ్‌లో ఒక వికెట్ తీశాడు. కోహ్లీసేన 66 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన అర్ధశతకాన్ని కొన్నాళ్ల క్రితం చనిపోయిన తన తండ్రికి అంకితమిస్తున్నానని ప్రకటించాడు.
"ఈ ప్రదర్శన నాన్నకు అంకితమిస్తున్నా. ఆయన ఆశీర్వాదాలు ఎప్పటికీ మన వెంట ఉంటాయి. మనిద్దరికీ భావోద్వేగం కలిగించే అంశమిది. నీ(హార్దిక్) నుంచి టోపీ అందుకోవడం చూసి ఆయన(నాన్న) సంతోషించే ఉంటారు" అని కృనాల్ అన్నాడు.
"16న ఉదయం ఆయన మరణించారు. ఆ రోజు నేను ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్నా. తర్వాత రోజు ఉదయం ఏ దుస్తులు వేసుకోవాలో ముందురోజు రాత్రే సిద్ధం చేసుకోవడం నాన్నకు అలవాటు. అందుకే ఆయన దుస్తుల సంచీని బరోడా నుంచి ఇక్కడికి తీసుకొచ్చా. ఆయన లేరని తెలుసు. అందుకే మ్యాచ్ వీక్షించేందుకు ఆయన ధరించే దుస్తులనైనా ఇక్కడికి తీసుకొచ్చాను. డ్రస్సింగ్ రూమ్‌లో ఉంచాలనుకున్నాను" అని కృనాల్ వెల్లడించాడు.
'మన జీవిత కాలంలో తొలిసారి మన నాన్న డ్రస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. ఆయనెప్పుడూ మనతోనే ఉంటారు. మనిద్దరి తరఫున నువ్వు అద్భుతంగా ఆడావ్ కృనాల్. ఆయనకు నువ్వు ముందే పుట్టినరోజు కానుక ఇచ్చినట్టు నాకు అనిపించింది' అని హార్దిక్ భావోద్వేగం చెందాడు.
ఇదీ చదవండి: షా మరికొంత కాలం వేచి చూడాల్సిందే!: లక్ష్మణ్