ఆసీస్ పర్యటనలో టీమ్ఇండియాకు తొలి విజయం. కాన్బెర్రాలో జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌ను 13 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు ఆసీస్ గెలవడం వల్ల సిరీస్‌ను 2-1 తేడాతో కంగారూ జట్టు సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆచితూచి ఆడింది. దీంతో వరుస విరామాల్లో శిఖర్ ధావన్(16), శుభ్‌మన్ గిల్(33), కోహ్లీ(63), శ్రేయస్ అయ్యర్(19), కేఎల్ రాహుల్(5) వికెట్లు కోల్పోయింది. దీంతో కనీసం 250 పరుగులు అయినా చేస్తుందా అని అభిమానులు అనుకున్నారు.
అయితే చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్య(92*), రవీంద్ర జడేజా(66*) వీర విహారం చేశారు. చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో అగర్ 2, హేజిల్‌వుడ్, అబాట్, జంపా ఒక్కో వికెట్ తీశారు.
ఛేదనలో ఆసీస్ బాగానే ఆడినప్పటికీ వరుసగా వికెట్లు పడటం వల్ల 13 పరుగుల తేడాతో గెలుపును దూరం చేసుకుంది. ఫించ్(75), మ్యాక్స్‌వెల్(59) ఎక్కువ పరుగులు చేశారు. మిగిలిన వారు నామమాత్రంగానే ఆడారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్ 3 వికెట్లు తీయగా, నటరాజన్, బుమ్రా తలో 2, కుల్దీప్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇది చదవండి: సచిన్‌ను అధిగమించిన కోహ్లీ- వన్డేల్లో సరికొత్త రికార్డు