ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా వినిపిస్తున్న పేరు ఐపీఎల్. మరికొద్ది రోజుల్లో టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో ఎక్కడ చూసినా ఈ సందడే కనిపిస్తోంది. కరోనా లాక్డౌన్ తర్వాత జరుగుతున్న అతిపెద్ద లీగ్ ఇదే కావడం వల్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన భారత ఆటగాళ్లందరూ దుబాయ్ చేరుకున్నారు.
అయితే ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి బౌలర్లపై వారు పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్లోనూ ఎక్కువ పరుగులు చేసి రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది కూడా తమ హిట్టింగ్తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే సత్తా ఉన్న టాప్-5 బ్యాట్స్‌మెన్‌పై ఓ లుక్కేద్దాం.
విరాట్ కోహ్లీ
ఈ ఏడాది ఎలాగైనా సరే టైటిల్‌ను గెలవాలని పరితపిస్తున్న ఫ్రాంచైజీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ ఆట గురించి ప్రతి అభిమానికి తెలుసు. గత మూడేళ్లుగా ఆర్సీబీ, పాయింట్ల పట్టికలో చివర్లో నిలుస్తున్నప్పటికీ, విరాట్ మాత్రం తన వ్యక్తిగత ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సారథిగానే కాకుండా.. ప్రధాన బ్యాట్స్‌మన్‌గానూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి ఈ సీజన్లో ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
రోహిత్ శర్మ
గడిచిన రెండు ఐపీఎల్ సీజన్లలో రోహిత్ శర్మ ప్రదర్శన అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అతడి అద్భుత బ్యాటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన వారిని ఇతడు కాస్త నిరాశే మిగిల్చాడు. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో, ప్రపంచకప్‌లో తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించాడు. దీంతో ఈ సీజన్లో రోహిత్ ఫామ్‌పై ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కేఎల్ రాహుల్
గత సంవత్సరం బ్యాటింగ్‌తో మ్యాజిక్ చేసిన క్రికెటర్ కేఎల్ రాహుల్. టీమ్ఇండియాలో ఇటీవలే కాలంలో రాహుల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి.. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ సత్తా చాటాలని చూస్తున్నాడు. గత రెండు సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన రాహుల్.. 50కిపైగా సగటుతో జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.
డేవిడ్ వార్నర్
గత సీజన్లో బ్యాటింగ్‌తో ప్రభంజనం సృష్టించాడు వార్నర్. దీంతో ఇప్పుడూ అద్భుత ప్రదర్శన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. గతేడాది వార్నర్ 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో నిలిచి, ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు 2017లోనూ ఈ ఘనత సాధించాడు.
జోస్ బట్లర్
2018లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన జోస్ బట్లర్.. అద్భుత ఇన్నింగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ఏడాది 54.80 సగటుతో 548 పరుగులు చేశాడు. గతేడాది కేవలం 9 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేసి రాజస్థాన్ కీలక ఆటగాడిగా మారాడు. గత సీజన్లో మధ్యలోనే వెళ్లిపోయాడు కానీ ఈ సారి మాత్రం అన్ని మ్యాచ్‌లు ఆడనున్నాడు.