టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. బరోడా క్రికెట్ అసోసియేషన్‌లోని యువ క్రికెటర్లతో ఇటీవలే తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ కార్యక్రమంలో తన సోదరుడు కృనాల్ కూడా పాల్గొన్నాడు. ఇందులో కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీలతో తనకున్న అనుభవాలను చెప్పుకొచ్చాడు హార్దిక్.
"మీలో కనీసం పదిమంది అయినా భారత జట్టులో ఆడాలి. లేదంటే నేను నిరాశకు గురవుతాను. వచ్చే పదేళ్లలో నాతో కలిసి ఎవరు ఆడాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. అది చాలా సరదాగా ఉంటుంది. ఇటీవలే కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడాను. 'ఆటలో మీ సమర్థతకు కారణమేంటి?' అని ప్రశ్నించాను. నాకు ఓ మెసేజ్‌లో సమాధానమిస్తూ..'నీ ఆటిట్యూట్‌తో పాటు అన్ని అంశాలు బాగానే ఉంటాయి. ఆటతీరులో నిలకడపై దృష్టి సారించాలి. మొదటి స్థానంలోకి వెళ్లాలంటే పరుగులపై ఆకలితో ఉండాలి. ఎవరినైనా కిందకి నెట్టడం కంటే ముందు మనలో ఉన్న టాలెంట్‌తో అత్యున్నత స్థాయికి ఎదగాలి" అని కోహ్లీ చెప్పాడు. తన విజయవంతమైన ప్రదర్శన వెనుక ఓ నిలకడ ఉందని నాకు అప్పుడే అర్థమైంది"
- హార్దిక్ పాండ్య, టీమ్ఇండియా ఆల్‌రౌండర్
రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలనూ ఉదహరిస్తూ.. బరోడా యువ క్రికెటర్లతో మాట్లాడాడు హార్దిక్. "రోహిత్, ధోనీ ఆటతీరులో చాలా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే రెండో స్థానంలో రావడానికి ఇష్టపడరు. కానీ, వారు కొన్ని పరిస్థితుల్లో వెనుకబడినా.. ముందుకు రావడానికి తీవ్రంగా శ్రమిస్తారు. మీరంతా ఉత్తమంగా ఉండేందుకు శ్రమించాలి. మీరు బౌలర్ అయితే అందులో ఉత్తమంగా శిక్షణ పొందాలి. ఒకవేళ మీరు ప్రాక్టీసులో ఉంటే దాని కోసం ఆత్రుతగా ఎదురుచూడాలి. మీతో మీకే పోటీ ఉండాలి" అని యువ క్రికెటర్లకు చెప్పాడు హార్దిక్.