కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణపై వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో పరిస్థితులు మెరుగుపడకపోతే లీగ్‌ను విదేశాల్లో నిర్వహించడమే పరిష్కారమని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. అయితే టోర్నీని స్వదేశంలో నిర్వహించడం ఫ్రాంచైజీలతో పాటు లక్షలాది క్రికెట్ ప్రేమికులుకూ చాలా ముఖ్యమని ఐపీఎల్ అధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు.
"విదేశీ ప్రయాణాలను ఓ నిమిషం పక్కన పెడితే.. వేరే దేశాల్లో ఐపీఎల్ నిర్వహించాలనే దానిపై ఒకసారి ఆలోచించండి. స్వదేశంలో టోర్నీ నిర్వహించడానికి ప్రస్తుతం తగిన పరిస్థితి లేదు. కానీ, ఐపీఎల్‌ను స్వదేశంలో నిర్వహించాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే క్రికెట్‌ను ఇక్కడ ఓ మతంలాగా భావిస్తారు. కాబట్టి ఈ టోర్నీతో ప్రజల మనసులపై చూపే సానుకూల ప్రభావాన్ని మీరు విస్మరించలేరు. విదేశీ ఆటగాళ్లు భారత్‌కు వస్తే తక్కువ మందే అవ్వడం వల్ల క్వారంటైన్‌కు వీలవుతుంది. కానీ, ఇక్కడి నుంచి వేరే దేశాల్లోకి వెళ్లడానికి ఎక్కువ మంది రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రసారకర్తల నుంచి వచ్చే డబ్బునే చూస్తున్నాం తప్ప మిగిలినవి ఆలోచించడం లేదు".
- ఐపీఎల్ అధికారి
ఐపీఎల్ నిర్వహణపై వివిధ క్రికెట్ బోర్డుల నుంచి ఆతిథ్యమిస్తామని అభ్యర్థనలు వచ్చినప్పటికీ, స్వదేశానికి వెలుపల టోర్నీని నిర్వహించే ఆలోచనకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే భారత ప్రజలకు ఈ టోర్నీ ఎంతగానో చేరువైన కారణంగా టోర్నీని ఇక్కడే నిర్వహించాలని వారు ఆశిస్తున్నారు.
"2009లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించిన ఐపీఎల్ తర్వాత ఓ ఏడాదిపాటు బీసీసీఐ సహా ఫ్రాంచైజీలు ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఫ్రాంచైజీలకు బీసీసీఐకు మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. 2014లో జరిగిన టోర్నీలో కొంత భాగమే యూఏఈ వేదికగా జరగడం వల్ల కొంతమేర నష్టప్రభావం తగ్గింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టోర్నీలో సగభాగాన్ని విదేశాల్లో నిర్వహించలేం. కాబట్టి విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచన ఇప్పుడు సముచితం కాదు" అని ఐపీఎల్ అధికారి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి... టీమ్ఇండియాలో స్మిత్‌కు ఇష్టమైన క్రికెటర్?