మహిళల క్రికెట్‌కు ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తోంది. వారి మ్యాచ్‌ల పట్ల అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. టీమ్ఇండియా మహిళలు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. పురుష ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆడుతున్నారు. ఇప్పటికే మహిళల వన్డే క్రికెట్లో అమెలియా కేర్ (232*), బెలిందా క్లర్క్ (229*) డబుల్ సెంచరీలు సాధించారు. అయితే భారత మహిళల జట్టులో కొందరు బ్యాట్స్ఉమెన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. వారెవరో ఓసారి చూద్దాం.
స్మృతి మంధాన (135)
ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్-2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్మృతి చెలరేగి ఆడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు చక్కటి శుభారంభాన్ని అందించింది మంధాన. స్లో పిచ్‌పై స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ 129 బంతుల్లోనే 135 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఫలితంగా టీమ్ఇండియా 303 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే అప్పటికి ఇంకా 7 ఓవర్లు మిగిలుండగా స్టంపౌట్‌గా వెనుదిరిగింది. స్మృతి జోరు చూస్తే కచ్చితంగా డబుల్ సెంచరీ చేస్తుందని అంతా భావించారు. ఈ మ్యాచ్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సు బాదింది మంధాన.
హర్మన్ ప్రీత్ కౌర్ (171*)
ప్రస్తుతం భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హర్మన్ ప్రీత్ తనదైన శైలి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకుంది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో పరుగుల జడివాన కురిపించిందీ క్రికెటర్. 20 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 115 బంతుల్లోనే 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఫలితంగా ఇండియా 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మ్యాచ్ మొత్తం ఓవర్లు సాగితే కౌర్ డబుల్ సెంచరీ సాధించేది.
దీప్తి శర్మ (188)
టీమ్ఇండియా మరో మహిళా క్రికెటర్ దీప్తి శర్మ డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చి ఔటైంది. 2017లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఆతిథ్య సౌతాఫ్రికా, భారత్ సమాన పాయింట్లతో ఉండటం వల్ల రన్‌రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఇండియాను విజేతగా ప్రకటించారు. అయితే ఆ రన్‌రేట్ మెరుగ్గా ఉండటానికి కారణం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 249 పరుగుల భారీ తేడాతో గెలవడమే.. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ 160 బంతుల్లో 188 పరుగులతో సత్తాచాటింది. ఇందులో 27 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు 46వ ఓవర్లో దీప్తి ఔటైంది. ఒకవేళ ద్విశతకం సాధిస్తే మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచేది దీప్తి.