టీమ్ఇండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ యూవీ అనగానే క్రికెట్ ప్రేమికులకు టక్కున గుర్తొచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు(2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై). ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన యూవీ.. 2000 అక్టోబర్‌లో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పోలగా 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టీ20ల్లో 1177 పరుగులు సాధించాడు. ఇంకా ఎన్నో ఘనతలు, రికార్డులు అందుకున్నాడు. ఓ సారి అతడికి ఆడిన ఐదు బెస్ట్ ఇన్నింగ్స్‌ను నెమరువేసుకుందాం..
69 పరుగులు వర్సెస్ ఇంగ్లాండ్.. నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్.. నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ అతడి కెరీర్‌లో హైలైట్. ఈ మ్యాచ్‌లో 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు గంగూలీ(60), సెహ్వాగ్(45) తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి పటిష్టమైన స్థితిలో నిలిపారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన యూవీ.. మరో ఎండ్‌లో మహ్మద్ కైఫ్.. మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను ముంఉదకు తీసుకెళ్లారు. ఆరో వికెట్‌కు ఇద్దరు కలిసి 221 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో టీమ్ఇండియాను గెలుపు దిశగా నడిపించారు. అయితే విజయాన్ని 59 పరుగులు అవసరమైన దశలో యువీ ఔటైనప్పటికి.. కైఫ్ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. చివరి వరకు క్రీజులో నిలబడి టీమ్ఇండియాకు విజయాన్ని అందించాడు. ఈ సందర్భంగా మ్యాచ్ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీ నుంచి కెప్టెన్ గంగూలీ తన షర్ట్‌ను విప్పి సెలబ్రేట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. యువీ కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
139 వర్సెస్ ఆస్ట్రేలియా.. 2004లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న యువరాజ్ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. అతడి ధాటికి టీమ్ఇండియా 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది.
58 వర్సెస్ ఇంగ్లాండ్.. 2007 టీ20 ప్రపంచకప్ ఇంగ్లాండ్‌తో మ్యాచ్. ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ యువరాజ్‌లోని విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అంతేకాదు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న యూవీ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్థసెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. యువీ జోరుతో టీమ్ఇండియా తొలిసారి టోర్నీలో 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది.
57 వర్సెస్ ఆస్ట్రేలియా.. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ ఆల్‌రౌండర్‌గా కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన యువీ తనలోని క్లాస్ ఆటను చూపించాడు. సురేశ్ రైనా సహకారంతో 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. 67 బంతుల్లో 57 పరుగులతో యువరాజ్ నాటౌట్‌గా నిలిచాడు.
150 వర్సెస్ ఇంగ్లాండ్.. కెరీర్ చివరి దశలో యువరాజ్ ఆడిన ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది. ఈ దశలో యువరాజ్.. ధోనితో కలిసి మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కిన యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. యువీ తన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరును అందుకున్నాడు. యువీతో పాటు ధోని కూడా సెంచరీతో రాణించడంతో టీమ్ఇండియా 381 పరుగులు భారీ స్కోరు చేసింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పరాజయం చెందింది. యువీ కెరీర్‌లో ఇదే ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయిన యువరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
ఇదీ చూడండి: రొనాల్డోపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్.. ఏ టైటిల్స్, ట్రోఫీలు మాకు అక్కర్లేదంటూ..