ఆస్ట్రేలియన్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె తల్లి మారియా కమిన్స్.. మృత్యువుతో పోరాడుతూ గురువారం రాత్రి తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దీంతో కమిన్స్ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల క్రికెట్ అభిమానులు ప్యాట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో నాలుగో టెస్టు రెండో రోజు ఆడుతున్న ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్స్ అందరూ ప్యాట్ తల్లికి నివాళిగా తమ చేతికి నల్లటి ఆర్మ్‌బ్యాండ్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ట్విట్టర్ వేదికగా ఆమె మృతి పట్ల సంతాపం తెలిపింది. 'మరియా కమిన్స్ మరణవార్త తెలిసి మేమంతా చాలా బాధపడుతున్నాం. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తరఫున ప్యాట్ కమిన్స్‌తో పాటు అతని కుటుంబం, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. ఆమె గౌరవార్థం ఆసిస్ టీమ్ రెండో రోజు మ్యాచ్‌కు నల్లటి ఆర్మ్బ్యాంట్స్ ధరిస్తుంది" అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు టీమ్ ఇండియా క్రికెట్ బోర్డు కూడా కమిన్స్ తల్లి మరియా మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపింది. 'భారత క్రికెట్ తరఫున మరియా మరణంపై చాలా బాధ పడుతున్నాం. ఈ కష్టకాలంలో ప్యాట్, అతని కుటుంబానికి మా సానుభూతి ఉంటుంది' అని బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. అయితే ఆమె గత కొంత కాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రంగా మారడం వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడే భారత్‌లో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ప్యాట్ కమిన్స్ తన తల్లి కోసం స్వదేశానికి వెళ్లాడు. అప్పటి నుంచి దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. మూడో టెస్టు ప్రారంభమయ్యే సమయానికి అతడు తిరిగి వస్తాడని భావించినప్పటికీ తల్లి ఆరోగ్యం మెరుగు పడకపోవడం వల్ల అతను అక్కడే ఉండిపోయాడు. అలా నాలుగో టెస్టుకు కూడా ప్యాట్ దూరంగానే ఉన్నాడు.
రెెండు టెస్ట్ సమయంలో ప్యాట్ కమిన్స్ వెళ్లిపోయిన తర్వాత అతని స్థానంలో మరో జట్టు సభ్యుడైన స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే వన్డే టీమ్‌కు కూడా కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతని తల్లి మరణంతో ఆ సిరీస్‌కు దూరమయ్యే అవకాశలున్నాయని అభిమానులు అంటున్నారు.