Ashes 2022: కేవలం మూడు రోజులే జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 271 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 124 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు క్రాలే (36), రోరీ బర్న్స్ (26) మినహా ఎవరూ ఆడలేదు. తొలి వికెట్‌కు వీరద్దరూ కలిసి అర్ధశతక (68) భాగస్వామ్యం నిర్మించారు. అయితే బర్న్స్ ఔటైన తర్వాత ఒక్కరు కూడా ఇన్నింగ్స్‌ను నిలబెట్టేలా ఆడలేకపోయారు. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో కేవలం 56 పరుగులకే మిగతా తొమ్మిది వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. మలన్ 10, రూట్ 11, స్టోక్స్ 5, పోప్ 5, బిల్లింగ్స్ 1, వోక్స్ 5, మార్క్‌వుడ్ 11 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 3, బొలాండ్ 3, గ్రీన్ 3.. స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు.
మార్క్‌వుడ్ చెలరేగడంతో..
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు అడ్డుకోగలిగారు. మార్క్‌వుడ్ (6/37), బ్రాడ్ (3/51), వోక్స్ (1/40) చెలరేగడంతో 155 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ (49), స్మిత్ (27), గ్రీన్ (23) రాణించడంతో ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 270 పరుగుల లీడ్‌లోకి వెళ్లింది.
స్కోరు వివరాలు
తొలి ఇన్నింగ్స్- ఆస్ట్రేలియా 303/10.. ఇంగ్లాండ్ 188/10
రెండో ఇన్నింగ్స్- ఆస్ట్రేలియా 155/10.. ఇంగ్లాండ్ 124/10