ab de villiers vs kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లతో పోటీపడాలనుందని సౌత్ఆఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో విరాట్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానన్నాడు. అతడు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయలు పంచుకున్నాడు.
కాగా డివిలియర్స్, కింగ్ కోహ్లీతో కలిసి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. వీరిద్దరూ కలిసి మైదానంలో అనేక సార్లు పరుగుల పారించి.. ఆర్సీబీ జట్టుకు ఎన్నో అసాధారణ విజయాలు అందించారు. గతంలో కూడా డివిలియర్స్.. కోహ్లీపై పలుమార్లు ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం అతడు ఆర్సీబీకి జట్టుకే ఆడాడు. ఇక ప్రస్తుతం క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్.. తన 360 డిగ్రీల ఆటతీరుతో డివిలియర్స్‌ను తలపిస్తున్నాడు.
"నాకు ఇప్పటికీ క్రికెట్ ఆడాలని ఉంది. కాని ఇప్పుడు ఆ అవకాశం లేదు. నా కెరీర్‌ను నేను అత్యుత్తమంగా ముగించలేదు. ఏడాదికి రెండు, మూడు నెలలు క్రికెట్ ఆడాలనుకోలేదు. ఎందుకంటే నేను ప్రపంచంలో గొప్ప బ్యాటర్‌గా ఉండాలనుకున్నా. కానీ సంవత్సరానికి మూడు నెలలు ఆడితే.. అది సాధ్యం కాదు. ఒకవేళ నేను మళ్లీ పిచ్‌లో అడుగుపెడితే.. విరాట్, సూర్యలతో పోటీపడాలని ఉంది"
- డివిలియర్స్, సౌత్ఆఫ్రికా మాజీ బ్యాటర్.
డివిలియర్స్ తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో.. ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మూడు సార్లు గెలుచుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ (15 బంతుల్లో ), సెంచరీ ( 31 బంతుల్లో ), 150 ( 64 బంతుల్లో ) పరుగులు తన పేరిటే ఉన్నాయి. మొత్తంగా డివిలియర్స్ తన కెరీర్లో వన్డేల్లో 9577 పరుగులు ( 25 శతకాలు ), టెస్టుల్లో 8765 పరుగులు (22 శతకాలు ) సాధించాడు. డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు 2021లోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా తన అసాధారణ ఆటతీరుతో డివిలియర్స్ భారత్‌లో కూడా ఎందరో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఆ బౌలర్లు ఇబ్బంది పెట్టేవారు..
గ్రౌండ్‌కు అన్ని వైపులా తనదైన శైలిలో షాట్లు ఆడగల డివిలియర్స్.. తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల గురించి కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. టీమ్ఇండియా యార్కర్ కింగ్ బుమ్రా, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వార్న్‌ల బౌలింగ్‌లో అతడు ఇబ్బంది పడేవాడని తెలిపాడు.