మధుర జ్ఞాపకాలు ఎన్నిసార్లు గుర్తుచేసుకున్నా సరే అద్భుతంగానే ఉంటాయి. మనసుకు ఏదో తెలియని హాయినిస్తాయి. వాటిని స్క్రీన్‌పై చూసే మరింత ఆనందమేస్తుంది. త్వరలోనే అదే ఆనందాన్ని క్రికెట్ ప్రేమికులు చూడబోతున్నారు. అదేంటని అనుకుంటున్నారా?
టీమ్ఇండియాకు ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది 2007 టీ20 ప్రపంచకప్. ఎందుకంటే టీ20 క్రికెట్‌లో మన జట్టే తొలి విశ్వవిజేత. ఈ మెగాటోర్నీనే మరోసారి మన ముందుకు రాబోతుంది. సీనియర్లు లేని భారత జట్టు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో ఈ ఘనత సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చారిత్రక విజయం నమోదు చేసి సగటు భారత క్రికెట్ అభిమాని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. ఆ మధుర స్మృతులు ఎప్పుడూ అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉంటాయి. ఇప్పుడా స్మృతులనే త్వరలోనే స్క్రీన్‌పైకి మరోసారి తీసుకురానున్నారు.
ఎప్పటికీ మర్చిపోలేం.. ప్రస్తుత క్రికెట్‌లో టీ20కు ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. అయితే టీ20ల్లో ఎన్ని లీగ్స్ వచ్చినా, ఎన్ని వరల్డ్ కప్స్ జరిగినా.. 2007 టీ20 ప్రపంచకప్ మాత్రం టీమ్‌ఇండియా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో ఏ జట్టుకి కూడా అప్పటికి పెద్దగా అనుభవం లేదు. అలానే అప్పటివరకు ఉన్న సీనియర్స్ కాకుండా కుర్రాళ్లతో భారత జట్టు ఈ సిరీస్ లో అడుగుపెట్టింది. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తూ, ఫైనల్లో దాయాది పాక్‌ని మట్టికరిపించి కప్ ఎగరేసుకుపోయింది. నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లో జోగిందర్ శర్మ వేసిన ఆ చివరి ఓవర్ అయితే మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మిస్బా ఆడిన స్కూప్ షాట్‌ను అనూహ్యంగా క్యాచ్ అందుకున్న శ్రీశాంత్.. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్ ధోనీని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ముఖ్యంగా అప్పుడే కెరీర్ ప్రారంభించిన ధోనీ కూడా తన స్టామినా ఏంటనేది ఒక్క టోర్నీతో నిరూపించుకున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో మహీ పేరు మార్మోగిపోయింది. అదే టోర్నీలో యువరాజ్.. ఇంగ్లాండ్ జట్టుపై ఒకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్సుల్ని ఇప్పటికీ మర్చిపోలేం. మొత్తంగా ఈ మెగా టోర్నీ విజయం సమష్టి కృషికి నిదర్శనం, అసలైన సారథ్యానికి నిలువుటద్దం. ఇప్పుడా మధుర అనుభూతుల్నే డాక్యూమెంటరీ వెబ్‌సిరీస్ రూపంలో స్క్రీన్ పైకి తీసుకురానున్నారు.
యూకేకు చెందిన వన్ వన్ సిక్స్ నెట్ వర్క్ దీన్ని నిర్మిస్తోంది. ఆనంద్ కుమార్ డైరెక్టర్. ఈ సిరీస్‌ను పలు భాషల్లో డాక్యుమెంటరీగా తీస్తున్నారు. అంటే రియల్ ఇన్సిడెంట్స్నే మళ్లీ మన కళ్ల ముందుకు తీసుకొస్తారు. అప్పటి జట్టులోని 15 మంది ఆటగాళ్లు, తమ అనుభవాల్ని పంచుకుంటారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూరైంది. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ వెబ్ డాక్యు సిరీస్‌ను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఇదీ చూడండి: కేన్ మామపై కన్నేసిన ఐపీఎల్ టీమ్ ఇదే!.. మరీ అన్ని కోట్లా?