విరాట్ కోహ్లీ.. టీమ్‌ఇండియా సగటు క్రికెట్ అభిమానికి ధైర్యం.. సహచరులకు భరోసా.. జట్టుకు బలం.. దేశానికి విజయం.. కఠోర శ్రమకు ప్రతిరూపం ఇలా అన్ని లక్షణాలు ఇమిడి ఉన్న రికార్డులు రారాజు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ విరాటుడు.. బుధవారానికి(ఆగస్టు 18) 13 ఏళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్. గత రెండున్నరేళ్లుగా పరుగులు చేయడంలో విఫలమవుతున్న అతడు.. ఒక్కసారి కుదురుకుంటే ఏ బ్యాట్స్‌మెన్ కూడా అతడి దారిదాపుల్లో ఉండడు. ఏ ఫార్మాట్‌లో, ఏ జట్టు మీదైనా, ఎక్కడైనా సరే పరుగుల వరద పారించగల పవర్ ఉన్న క్రికెటర్ కోహ్లీ. అండర్ 19 స్థాయిలోనే టీమ్‌ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన అతడు.. తనదైన నాయకత్వంతో భారత జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. అందుకే నవతరంలో అత్యుత్తమ సారథిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
విరాట్ ప్రస్థానంలోని కొన్ని రికార్డులు..
కోహ్లీ జెర్సీ నెంబర్ ఓ జ్ఞాపకం..
విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 అని అందరికీ తెలుసు. కోహ్లీ తండ్రి డిసెంబరు 18న మరణించారు. అప్పటికీ కోహ్లీ వయసు 18. తన తండ్రి జ్ఞాపకార్థం అప్పటి నుంచి 18వ నెంబర్ జెర్సీని ఉపయోగిస్తున్నాడు.
'కోహ్లీ' ప్రత్యేకతలు..
22 ఏళ్ల కంటే ముందే వన్డేల్లో రెండు శతకాలు చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతడికంటే ముందు సచిన్ తెందూల్కర్, సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు.
ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకం చేసిన తొలి భారత ఆటగాడు కోహ్లీ. 2011 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో విరాట్ అదరగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 175 పరుగులు చేశాడు.
వన్డేల్లో పాకిస్థాన్‌పై అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డూ కోహ్లీ పేరిటే ఉంది. 2012 ఆసియాకప్‌లో 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి అత్యుత్తమ స్కోరు కూడా ఇదే కావడం విశేషం. అంతకుముందు విండీస్ మాజీ క్రికెటర్ లారా(156) పేరిట ఈ రికార్డు ఉండేది.
23 ఏళ్లకే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకున్నాడు విరాట్. 2012లో ఈ ఘనత సాధించాడు. వేగంగా 1000, 2000, 3000, 4000, 5000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో వేగంగా 7000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గానూ ఘనత సాధించాడు.
ఛేదనలో మొనగాడు..
లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీని మించిన ఆటగాడు లేడంటే అతిశయోక్తి లేదు. అతడు చేసిన మొత్తం శతకాల్లో.. ఛేదనలో చేసినవే ఎక్కువ. వీటన్నింటిలో 2012లో శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన త్రైపాక్షిక మ్యాచ్ హైలెట్. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 321 పరుగులు చేసింది. ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమిండియా 40 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. ఆ మ్యాచ్‌లో విరాట్ వీర విహారం చేశాడు. 86 బంతుల్లో 133 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.
రన్ మెషీన్...
2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ఇప్పటివరకు 94 టెస్టుల్లో 7609 పరుగులు చేశాడు. 254 వన్డేల్లో 12,169 రన్స్, 90 టీ20ల్లో 3159 పరుగులు చేశాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ కోహ్లీ సత్తా చాటుతున్నాడు. వన్డేల్లో టాప్-2 ర్యాంక్, టెస్టుల్లో 5వ ర్యాంక్, టీ20ల్లో 5వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే కెరీర్లో 70 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. ఇందులో 27 శతకాలు టెస్టుల్లో చేయగా.. 43 వన్డేల్లో సాధించాడు.
ఏకైక క్రికెటర్ కోహ్లీనే
ఐసీసీ టీ20 ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడిన కోహ్లీ.. ఈ ఘనత సాధించిన ఏకైక్ క్రికెటర్‌గా నిలిచారు. ఏదైనా ఒక్క ఐసీసీ కప్ గెలిస్తే, కోహ్లీ కెరీర్ సంపూర్ణమవుతుంది!