Marakkar Movie Review: చిత్రం: 'మరక్కార్- అరేబియా సముద్ర సింహం'; నటీనటులు: మోహన్‌లాల్, సుహాసిని, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్, కీర్తిసురేష్, అర్జున్ సర్జా, సునీల్‌శెట్టి, మంజు వారియర్, నెడుముడి వేణు తదితరులు; స్క్రీన్‌ప్లే: ప్రియదర్శన్, అని శశి, సంగీతం: రోనీ రాఫెల్; నేపథ్య సంగీతం: రాహుల్ రాజ్, అంకిత్ సూరి, లైల్ ఎవ్‌నాస్ రోడర్; ఛాయాగ్రహణం: తిరునావుక్కరసు; కూర్పు: అయ్యప్పన్ నాయర్; నిర్మాణం: ఆంటోనీ పెరంబవూర్; దర్శకత్వం: ప్రియదర్శన్; విడుదల: సురేష్ ప్రొడక్షన్స్; విడుదల తేదీ: 2021 డిసెంబరు 2
మలయాళం తమిళ భాషల్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'మరక్కార్'. విడుదలకి ముందే పలు జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకుని, ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది. ప్రచార చిత్రాల విడుదల తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. మోహన్‌లాల్‌కి తెలుగులో మంచి గుర్తింపు, మార్కెట్ ఉండటం వల్ల ఈ చిత్రం తెలుగులోనూ అనువాదమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని విడుదల చేసింది. 'బాహుబలి' తరహా విజువల్స్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు 'మరక్కార్' కథ ఏంటి?
కథేంటంటే: 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర అయిన కుంజలి మరక్కార్ ఆధారంగా రూపొందిన చిత్రమిది. సముద్ర యుద్ధ వ్యూహాల్లో ఆరితేరినవాడు, కడలిలో కనికట్టుతో అల్లాడించే మాంత్రికుడైన మహమ్మద్ అలీ అలియాస్ కుంజాలి మరక్కార్ (మోహన్‌లాల్). కొచ్చిన్‌పై పోర్చుగీసుల దాడికి వ్యతిరేకంగా సాగిన పోరాటానికి మరక్కార్లు వారి జీవితాల్నే అంకితం చేశారు. పోర్చుగీసు సైన్యంతో తన కుటుంబం మొత్తాన్ని కళ్ల ముందే చంపేస్తారు. అప్పట్నుంచి కుంజలి మరక్కార్ పరారీలో ఉంటాడు. పోర్చుగీస్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిన బూనుతాడు. అదే సమయంలో కొచ్చిన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోర్చుగీస్ సైన్యం ప్రణాళిక రచిస్తుంది. సముద్రంలో వాళ్లని అడ్డుకోవడం కోసం మరక్కార్ సరైన వ్యక్తని నమ్మిన కొచ్చిన్ రాజు సమూతిరి (నెడుముడి వేణు) అతన్ని తన సముద్ర సైన్యానికి లెఫ్టినెంట్‌గా నియమిస్తాడు. మరి కుంజాలి మరక్కార్ పోర్చుగీసు వారితో సముద్రంలో ఎలా పోరాటం చేశాడు? అందులో గెలుపు సొంతమయ్యాక మరక్కార్ ఎవరి చేతుల్లో ఎలా మోసపోయాడనే విషయాలతో సినిమా సాగుతుంది.
ఎలా ఉందంటే: ఒక వీరోచిత యోధుడి కథ ఇది. అరుదైన సముద్ర నేపథ్యం కూడా ఈ కథకి ఉంది. కుంజాలి పోరాట పటిమ, అతని జీవితంలో ఆటుపోట్లు, మోస్ట్ వాంటెడ్ నేరగాడిగా ఉంటూ ధనవంతుల్ని కొట్టి పేదలకి పంచే మంచితనం, పోర్చుగీసుని గెలిచాక నమ్మి మోసపోయే తీరు.. ఇలా కావల్సింత హీరోయిజం, డ్రామా, సెంటిమెంట్, కుట్రలకి తోడు సరికొత్త నేపథ్యం ఉన్న కథ ఇది. ఇలాంటి ఓ కథతో అద్భుతాలే సృష్టించవచ్చు. కానీ, చిత్రబృందం ఈ విషయాలపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు. కేవలం సాంకేతికతపై ఆధారపడి సినిమాని తీసింది. విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ , పోరాట ఘట్టాలు మినహా సినిమాలో చెప్పుకోదగిన అంశాలేమీ లేవు. కథ పరంగా ఏ దశలోనూ రక్తికట్టించలేదు దర్శకుడు. భావోద్వేగాలు పండక, తదుపరి ఏం జరుగుతుందో అని సులభంగా ఊహకి అందేలాగానూ సినిమా ఆసాంతం చప్పగా సాగుతుంది. పేలవమైన రచన ఈ సినిమాకి శరాఘాతమైంది.
సినిమా మొదలై సగమైనా కొత్త పాత్రలు పుట్టుకొస్తూనే ఉంటాయి తప్ప, పరిచయమైన పాత్రలు ప్రభావమే చూపించవు. బోలెడంత మంది నటులు ఉన్నా సినిమాపై ఏ ఒక్కరూ ప్రభావం చూపించలేకపోయారు. మరక్కార్ పాత్రలో మోహన్‌లాల్ కూడా అంతంత మాత్రంగానే కనిపించారు. రెండు పోరాట ఘట్టాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయంతే. చరిత్రని పుస్తకాల్లో చెప్పినట్టే చెబితే అందులో ప్రయోజనం ఏమీ ఉండదు. సినిమా అన్నప్పుడు కాస్తయినా ఆసక్తి రేకెత్తించాలి. ఎక్కడో ఒకచోట హృదయాల్ని బరువెక్కించాలి. ప్రతీ పాత్రలోనూ సంఘర్షణ ఉంటుంది. కానీ, ఆ సంఘర్షణ ఎక్కడా రక్తికట్టలేదు. జూనియర్ మరక్కార్, అతని ప్రేయసి పాత్రల్లో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్, దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ కలిసి ఆరంభంలో చేసిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయంతే. కీర్తిసురేష్, మంజు వారియర్‌కి చిన్న పాత్రల్లో మెరిశారంతే. అర్జున్ సర్జా, సునీల్‌శెట్టి తదితర ప్రముఖ నటులు ఉన్నప్పటికీ వారి పాత్రల్లోనూ, వారి పోరాటాల్లోనూ ఏమాత్రం బలం కనిపించలేదు. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ ఆయన బృందం కథనం విషయంలో చేసిన కసరత్తలు సరిపోలేదు. ‘బాహుబలి’లాంటి చిత్రాల్లో సాంకేతికత ఎంతున్నా, అంతకంటే బలమైన భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావం చూపించారు. ఈ సినిమాలో అక్కడే తప్పు జరిగింది. నిడివి కూడా ఇబ్బంది పెడుతుంది.
ఎవరెలా చేశారంటే: మోహన్‌లాల్ పోషించిన కుంజాలి పాత్రే సినిమాకి కీలకం. పోరాట ఘట్టాల్లో తన శక్తి మేరకు నటించారు. అయితే ‘మన్యంపులి’లో కనిపించినంత హుషారు ఇందులో కనిపించదు. భావోద్వేగ సన్నివేశాల్లో తన అనుభవాన్ని ఉపయోగించారు. ప్రణవ్, ప్రియదర్శిని జోడీ ఆకట్టుకుంటుంది. అర్జున్, సునీల్‌శెట్టి, నెడుముడి వేణు, సుహాసిని, ప్రభు పాత్రల పరిధి మేరకు నటించారు. కీర్తి సురేష్, మంజు వారియర్ అంత చిన్న పాత్రల్ని పోషించడానికి ఒప్పుకోవడం విశేషమే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ పాటు, సాబు సిరిల్ కళా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. సంగీతం బాగుంది, తిరు కెమెరా పనితనం సినిమాకి మరింత వన్నె తెచ్చాయి. రచన పక్కాగా లేకపోతే ఏ విభాగం ఎంత ప్రతిభ చూపించినా ప్రయోజనం ఉండదని ఈ సినిమా నిరూపిస్తుంది. నిర్మాణం బాగుంది. ప్రియదర్శన్ కథనం పరంగా దృష్టిపెట్టుంటే ఈ సినిమా మరోస్థాయిలో ఉండేది.
బలాలు
- కథా నేపథ్యం, పోరాట ఘట్టాలు
- మరక్కార్ పాత్ర
- ఛాయాగ్రహణం
- సంగీతం
బలహీనతలు
- కథనం
- భావోద్వేగాలు పండకపోవడం
చివరిగా: 'మరక్కార్'... గాండ్రింపు లేని సముద్ర సింహం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చూడండి : Siddharth on ticket price: 'సినీ పరిశ్రమను వేధించడం ఆపండి'