తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలకు(South indian movies craze) దేశవ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నారా? ఇక్కడ ఎక్కువగా పాన్‌ఇండియా లక్ష్యంగా ప్రాజెక్టులు ఎందుకు రూపొందుతున్నాయి? హాలీవుడ్, బాలీవుడ్ నటులకు దక్షిణ భారతదేశ చిత్రాల్లో ముఖ్యపాత్రలు ఎలా లభిస్తున్నాయి? దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఇక్కడి సినిమాలపై ఆసక్తి ఎందుకు పెరుగుతోంది? ఇంటర్నెట్‌లో ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్ర వివరాల కోసం ఎందుకు వెదుకుతున్నారు?...
దక్షిణ భారత దేశంలో రూపొందుతున్న సినిమాలు అలాంటివి. 2015లో విడుదలైన 'బాహుబలి-ది బిగినింగ్'(Bahubali movie) దీనికి పునాది వేసిందని చెప్పవచ్చు. తర్వాత కన్నడంలో రూపొందిన 'కేజీఎఫ్-చాప్టర్1'(KGF Chapter1 movie) దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. వీటి తర్వాతే దక్షిణ భారతదేశ సినిమాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. దీనికి ఓటీటీ వేదికలు తోడవడం వల్ల ఇక్కడి సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ఆదరణ, ఆదాయం భారీగా అందుతోంది. అందుకు ఇటీవల వెలువడుతున్న ఫలితాలు... లెక్కలే సాక్ష్యం. కావాలంటే మీరే చదవండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రెట్టింపు అయ్యింది
సాధారణంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కువగా వెదుకుతున్న అంశాల గురించి ఒక సూచిక ఉంటుంది. ఇది 0 నుంచి 100 వరకూ పాయింట్ల రూపంలో ఆసక్తిని చూపిస్తుంటుంది. గతేడాది నవంబర్ 8వతేదీ నుంచి 14వ తేదీ వరకూ ఎక్కువ మంది ఏ సినిమా కోసం ఆసక్తి కనబరిచారంటే... తమిళ కథానాయకుడు సూర్య నటించిన 'సురారై పొట్రు'. దీనికి 100 పాయింట్లు లభించాయి. అదే సమయంలో హిందీ సినిమాలైన 'చల్లాంగ్'కు 17, 'లూడో' చిత్రానికి 50 పాయింట్లు వచ్చాయి. ఈ లెక్కలు సినీపరిశ్రమలో దక్షిణ భారత దేశ హవాను చూపిస్తున్నాయి.
దక్షిణ భారత సినిమాల కోసం ఇంటర్నెట్‌లో వెతికే వారి సంఖ్య 2020తో పోల్చితే 2021 ఏప్రిల్‌లో రెట్టింపు అయ్యింది. మలయాళం చిత్రం 'జోజి'(అమెజాన్‌లో), 'ఇరుల్'(నెట్‌ఫ్లెక్స్‌లో) కోసం మహారాష్ట్ర, దిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోను అభిమానులు వెదికారు. వీటి తరువాత తమిళంలో కమల్‌హాసన్ కథానాయకుడిగా రూపొందుతున్న 'విక్రమ్', తెలుగులో అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప' కోసం ఇంటర్నెట్‌లో ఎక్కువ మంది ఆసక్తిగా చూశారు.
హిందీ సినిమాలు కంటే ఎక్కువ
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర, అమిర్‌ఖాన్ లాల్‌సింగ్‌చద్ధా కంటే కాస్త ఎక్కువగానే తెలుగు, కన్నడ సినిమాల కోసం దేశంలోని ప్రేక్షకులు ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ల్లో ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్',(RRR movie) కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'కేజీఎఫ్-చాప్టర్2' కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నట్లు ఆర్‌మ్యాక్స్ మీడియా కన్సల్టెంగ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి శైలేష్ కపూర్ చెప్పుకొచ్చారు. "హిందీలో డబ్ అయిన తెలుగు, తమిళ చిత్రాలకు యూట్యూబ్, ఓటీటీల్లో ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఈ హక్కులు పొందిన వారికి ఆ స్థాయిలో ఆదాయమూ సమకూరుతోంది. దేశంలోని సినిమా మార్కెట్‌లో 2019లో 36శాతమున్న దక్షిణ భారత దేశ వాటా 2021లో 45 శాతానికి పెరిగింది" అని శైలేష్ కపూర్ తెలిపారు.
అమెజాన్‌కు దేశంలో జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న గౌరవ్‌గాంధీ మాట్లాడుతూ.."తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలకు వస్తున్న వీక్షకుల సంఖ్యలో 50శాతం వేరే రాష్ట్రాల నుంచే ఉంటోంది." అన్నారు. "నెట్‌ఫ్లిక్స్‌లో టాప్10లో ఉన్న వాటిల్లో ఎక్కువగా తమిళం, తెలుగు సిరీస్‌లు, సినిమాలే ఉంటున్నాయి. వెబ్‌సిరీస్ 'నవరస భారతదేశంతో పాటు శ్రీలంక, మలేషియా వంటి 10 దేశాల్లో టాప్10లో స్థానం సంపాదించింది. 'నవరస'ను వీక్షించిన వారిలో 40శాతం మంది ఇతర దేశాల నుంచి ఉండటం గమనార్హం" అని నెట్‌ఫ్లిక్స్ డీలర్ ప్రతీక్షరావ్ తెలిపారు. అలాగే తెలుగు వెబ్‌సిరీస్‌లు 'పిట్టకథలు', 'సినిమా బండి', తమిళంలో తీసిన 'పావ కాదైగల్', 'మండేలా'.. మలయాళంలో రూపొందిన 'నాయట్టు' తదితరాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించారు. ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కిన 'జగమే తిందిరమ్' సినిమాను ఇతర దేశాల్లోనే ఎక్కువగా చూశారు. ఇది 12దేశాల్లో టాప్10లో చోటు సంపాదించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"నారప్ప(Narappa movie) చిత్రాన్ని 4100 నగరాలు, పట్టణాల్లో చూశారని అమెజాన్ యాజమాన్యం తెలిపింది. 180 దేశాల్లో ఈ సినిమాకు వీక్షకులు ఉన్నారన్నారు. ఈ విషయం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల్లో థియేటర్లలో విడుదల చేయలేకపోయాం. అయినా వారిచ్చిన నివేదికతో ప్రేక్షకుల నాడి తెలిసింది.' అని ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు నారప్ప విజయోత్సవంలో ప్రకటించిన విషయం ఇక్కడ గమనార్హం.
కారణాలేంటి?
'గతంలో ఓ దక్షిణ భారతదేశ సినిమా హిందీలోకి రావాలంటే ఉన్న ఏకైక మార్గం శాటిలైట్. హిందీలో డబ్ చేసుకొని టీవీలో ప్రసారం చేసేవారు. ప్రస్తుతం ఓటీటీలు వచ్చాక... అవకాశాలు పెరిగాయి. దక్షిణ భారతదేశంలో మంచి కథలు పుట్టుకొస్తున్నాయి. వీటిని అభినయించడానికి మంచి నటులు ముందుకొస్తున్నారు. వీరు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానుల సంఖ్యను భారీగా పెంచుకుంటున్నారు.
"అల్లు అర్జున్, రానా, సమంతా, ధనుష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, విజయ్‌దేవరకొండ వంటి వారికి సోషల్‌మీడియాలో దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. వేగవంతమైన, చవకైనా ఇంటర్నెట్ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలపై అవగాహన పెరిగింది. కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడటం వల్ల ఓటీటీల్లోనే ప్రేక్షకులు సినిమాలకు అలవాటు పడ్డారు. భాషతో సంబంధం లేకుండా మంచి కథ ఉంటే చాలు... ఏ దేశంలోనైనా చూసేస్తున్నారు." అని కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్ సహ వ్యవస్థాపకుడు విజయ్ సుబ్రమణియన్ తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"దక్షిణ భారతదేశంలో దర్శకులు, నిర్మాతలు ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమాల్లో ఇతర రాష్ట్రాల నుంచి నటులను తీసుకుంటున్నారు. 'కేజీఎఫ్- చాప్టర్2'లో(KGF charpter 2 movie) బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్‌దత్, రవీనాటండన్ వంటి వారు నటిస్తున్నారు. అలాగే 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోనూ అజయ్ దేవ్‌గణ్, అలియాభట్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిస్తున్న పాన్‌ఇండియా చిత్రంలో అమితాబ్, దీపికా పదుకొనే నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. వివిధ దేశాల్లోనూ మార్కెట్టుకు అవకాశం పెరుగుతోంది. అందుకే ఇక్కడి చిత్రాలపై ఓటీటీలు ఆసక్తి కనబరుస్తున్నాయి" అని శైలేష్ కపూర్ వివరించారు.
పెరుగుతున్న అభిమానులు
"ఓటీటీల ద్వారా మా మార్కెట్ విస్తృతమైంది. 'కురుతి', కోల్డ్‌కేస్ చిత్రాలు కేరళ, భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఈ సినిమాల గురించి వివిధ దేశాల్లో సినీ అభిమానులు మాట్లాడుకున్నారు. ఇది మాకు ఎంతో గర్వకారణం" అని పేర్కొన్నారు మలయాళ నటుడు, దర్శకుడు అయిన పృధ్వీరాజ్ సుకుమారన్. 'జులైలో అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సార్పట్టా' చిత్రం దేశవ్యాప్తంగా నాకు అభిమానులను సంపాదించిపెట్టింది. కథ బాగుంటే... భాషతో పనిలేదని నిరూపించింది" అని తెలిపారు కథానాయకుడు ఆర్య.
ఇదీ చూడండి: bandla ganesh: 'అందుకోసమే ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు వీడ్కోలు'