అగ్ర కథానాయికలకి ఎప్పుడో కానీ తీరిక దొరకదు. ఒక్కోసారి చేతిలో మూడు నాలుగు సినిమాలుంటాయి. ఒకొక్క రోజు ఒక్కో సెట్‌లో గడపాల్సిన పరిస్థితి. కథాచర్చలు, ప్రయాణాలు, రిహార్సల్స్, చిత్రీకరణలు, ప్రచార వేడుకలు... ఇలా నిత్యం బిజీ బిజీగా గడుపుతుంటారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితాన్నీ మరిచిపోతుంటారు. అలాంటివాళ్లకి ఎప్పుడైనా కాస్త విరామం దొరికిందంటే మనసుకు నచ్చినట్టుగా గడుపుతారు. పూర్తి సమయం వ్యక్తిగతం కోసమే కేటాయిస్తుంటారు. కొంతమంది తారలు మాత్రం ఇంటి పట్టునే ఉంటూ సినిమా కోసం కొన్ని కాల్షీట్లు కేటాయించారు. భాష, యాస, స్క్రిప్ట్‌లో తమ పాత్ర విషయాల్లో పట్టు సాధించే పనిలో పడ్డారు.
రష్మిక ఆశ... చిత్తూరు యాస
వరుస విజయాలు, అవకాశాలతో జోరు మీదున్న రష్మిక త్వరలోనే 'పుష్ప' కోసం రంగంలోకి దిగబోతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో నాయకానాయికలు చిత్తూరు యాసలో మాట్లాడతారు. అందుకే అల్లు అర్జున్‌తోపాటు రష్మిక చిత్తూరు యాసపై పట్టు పెంచుకుంటోంది. రష్మిక తెలుగులో చేసిన తొలి చిత్రం 'ఛలో'తోనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తెలుగు మాట్లాడటంలో మరింత మెరుగైంది. 'పుష్ప' కోసం సొంతంగానే డబ్బింగ్ చెప్పుకోబోతోందట రష్మిక. అందుకే ఆ సినిమాలోని సంభాషణల్ని ముందుగానే తెలుసుకుని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడూ చిత్రబృందంతో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ భాష విషయంలో మెలకువలు నేర్చుకుంటోంది. భవిష్యత్తులో తనని ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటారో చెప్పండంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులను కోరుతోంది.
లావణ్య త్రి'పాఠం'
హైదరాబాద్‌లోనే గడుపుతున్న లావణ్య త్రిపాఠి లాక్‌డౌన్‌తో వచ్చిన విరామాన్ని సైతం సినిమా కోసం వినియోగిస్తోంది. తన కొత్త చిత్రం 'చావు కబురు చల్లగా'కి సంబంధించిన ఆన్‌లైన్ వర్క్ షాప్‌లో పాల్గొంటోంది. కార్తికేయ కథానాయకుడిగా కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 సంస్థ నిర్మిస్తోంది. ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లో నాయకానాయికలు స్క్రిప్టుని చదువుతూ, ఆ పాత్రల్ని మరింత బాగా అర్థం చేసుకుంటున్నారు.
భాషా'రాశి'
తెలుగుతోపాటు, తమిళంలోనూ అవకాశాల్ని అందుకుంటూ రెండు చోట్లా కెరీర్‌ని పరుగులు పెట్టించే పనిలో ఉంది రాశీ ఖన్నా. తమిళంలో అగ్ర కథానాయకుడు సూర్య సరసన నటించే అవకాశాన్ని అందుకుందామె. ఆ చిత్రం కోసం ఇప్పట్నుంచే సన్నద్ధమవుతోంది. తన తమిళ భాషకి మెరుగులు దిద్దుకొంటోంది. ప్రత్యేకంగా టీచర్‌నీ నియమించుకుంది. మరో అగ్ర కథానాయిక తమన్నా 'సీటీమార్' సినిమా కోసం సొంతంగా, అదీ తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పుకోబోతోంది. దీనికోసం కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక సినిమాలతో సంబంధం లేకుండా తెలియని భాష ఏదో ఒకటి నేర్చుకోవాలని పాయల్ రాజ్‌పుత్, నిధి అగర్వాల్, రుహానిశర్మ ప్రయత్నిస్తున్నారు.