సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక సమాజంలో మనిషిని చూసే కోణం మారింది. ఒకప్పుడు కట్టుబొట్టు, మాట్లాడే విధానం చూసి ఒకరి వ్యక్తిత్వాన్ని, వాళ్ల అభిరుచులను అంచనా వేస్తే.. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్ట్‌లతో అవతలివారి వ్యక్తిత్వాలు, ఆలోచన ధోరణులను పసిగట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేదికలు అరచేతిలోకి చేరాక సినీతారలు, సినీ ప్రియుల మధ్య దూరం పూర్తిగా చెరిగిపోయింది. మరి మన తెలుగు తెర ముద్దుగుమ్మల వ్యక్తిత్వాల గురించి.. వారి అభిరుచుల గురించి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లు ఎలాంటి ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నాయో ఓసారి లుక్కేద్దాం పదండి.
కాఫీ బానిస.. అప్పుడప్పుడూ కవి
తమన్నా ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల్లో కొన్ని సరదా విషయాలు, మరిన్ని స్ఫూర్తిదాయక అంశాలు కనిపిస్తాయి. "నేను కాఫీ బానిసను. అప్పుడప్పుడూ కవిని, నిత్య విద్యార్థిని.. పరిపూర్ణమైన నటిని" అంటూ ఇన్‌స్టా వాల్‌పై తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించుకుంది. ఇక ఆమె ట్విట్టర్లో "కలలు కంటా.. నా మనసు చెప్పినట్లు నడుచుకుంటా" అని కనిపిస్తుంది.
చీకట్ల వెంట.. వెలుగులు
ఇలియానాలోనూ సానుకూల ఆలోచనా ధోరణి ఎక్కువే. అది తెరపైనా.. నిజ జీవితంలోనూ ఆమె నవ్వులో కనిపిస్తుంటుంది. ఆమె ఈ చక్కనైన వ్యక్తిత్వానికి ప్రతీకగా ఇన్‌స్టాలో ఓ చక్కటి ఆంగ్ల సామెత రాసుకుంది. "జీవితంలో కటిక అమావాస్య చీకట్లు కమ్ముకున్నా.. దాని వెంటనే పౌర్ణమి పంచే వెన్నెల వెలుగొస్తుందని గుర్తుంచుకో" అని గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఆ వాక్యం. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆ చిన్న సందేశం ప్రతిఒక్కరిలో చక్కటి స్ఫూర్తిని రగిలించేదే.
* కాజల్, రాశీఖన్నా కూడా సోషల్ వాల్‌పై తమ అంతరంగాలను ఆవిష్కంచారు. కాజల్ తనని తాను పరిపూర్ణమైన నటిగా పేర్కొనగా, రాశీ తనను సూర్యాస్తమయ ప్రేమికురాలిగా చెప్పింది.
నవ్వుతూ బతికేద్దాం
నేటితరంలో తెరపై పదిహేనేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో అనుష్క ఒకరు. తెలుగు చిత్రసీమలో నాయికా ప్రాధాన్య చిత్రాలకు ఊపు తీసుకొచ్చిన నటి. తనదైన అందం, అభినయంతో కోట్లాది అభిమానుల మనసులు కొల్లగొట్టిన అనుష్క విజయ రహస్యం.. ఏదేమైనా ఎప్పుడూ నవ్వుతూ బతికేయడం. ఆమె ఇన్‌స్టాలో "స్మైల్ ఆల్‌వేస్" అని రాసుకుంది.
ప్రకృతి ప్రేమికురాలు..
సహజసిద్ధ నటనకు పెట్టింది పేరు కేరళ కుట్టి సాయిపల్లవి. ఆమెను చూస్తే నటితో పాటు అద్భుతమైన డ్యాన్సర్ కనిపిస్తుంది. కానీ, నేనొక ప్రకృతి ప్రేమికురాలినంటూ ఇన్‌స్టాలో పంచుకుంటోందామె. అంతేకాదు.. తనలో చక్కటి నటితో పాటు పది మంది ప్రాణాలు నిలిపే వైద్యురాలు ఉన్నట్లు రాసుకుంది.
ఏదీ శాశ్వతం కాదు
గెలుపును చూసి పొంగి పోవడం.. ఓటమిని చూసి కుంగిపోవడం తెలియని వ్యక్తిత్వం సమంత సొంతం. ఈ స్ఫూర్తిదాయక ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా సామ్ ఇన్‌స్టావాల్‌పై ఆంగ్లంలో ఓ వాక్యం రాసి ఉంటుంది. "నీ జీవితంలో ఏం జరిగినా అన్నింటిని అలా జరగనివ్వు. సుఖం.. దుఃఖం ఏదైనా కానీ వాటిని అలా పోనివ్వు.. ఏదీ శాశ్వతం కాదు కదా" అన్నది దాని అర్థం. కాలం చెప్పే పాఠాలను, అది పంచే అనుభవాలను అలా స్వీకరిద్దాం. అన్న స్ఫూర్తిని రగిలిస్తుంది సామ్ ఇన్‌స్టా వాల్. ఆమె ట్విట్టర్ ఖాతాలో 'బిలీవ్' అన్న ఓ వ్యాఖ్య కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి.. మీపై నమ్మకాన్ని ఇతరుల్లో చెదరనివ్వకండి అనేలా ఉంటుందా స్టేటస్.
ఓ అద్భుతంలా ఉందాం..
మనిషిగా పుట్టడం ఓ అద్భుత వరం. కాబట్టి మన జీవిత ప్రయాణాన్ని అంతే అద్భుతంగా కొనసాగించాలి. ప్రతి విషయంలో.. చేసే ప్రతి పనిలో అందరికీ స్ఫూర్తినిచ్చే ఓ అద్భుతంగా నువ్వు దర్శనమివ్వాలి. ఈ సూత్రాలన్నింటినీ మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది హీరోయిన్ రష్మిక. అందుకే దీన్ని ప్రతిబింబించేలా తన 'ట్విట్టర్ వాల్‌పై 'బీ ఏ మిరాకిల్' అని రాసుకుంది.