Salman Khan snake bite: పాము కాటుపై స్పందించారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. పామును చంపలేదని, దానితో స్నేహం చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో వివరించారు.
"నా ఫామ్‌హౌజ్‌లో ఉన్న ఓ గదిలోకి పాము వచ్చింది. దీంతో చిన్నారులు భయపడ్డారు. నేను ఓ కర్రతో పామును బయటకు తీసుకెళ్లా. అది చేతిపైకి వచ్చింది. నేను మరో చేత్తో దానిని విడిపించుకోవడానికి ప్రయత్నించా. ఈ క్రమంలో పామును చూసి అది విషపూరితమని నా సిబ్బంది భావించారు. ఆ తర్వాత జరిగిన గందరగోళంలో భయపడిన పాము.. నన్ను మూడు సార్లు కరిచింది."
- సల్మాన్ ఖాన్, నటుడు
ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. వెంటనే సల్మాన్‌ను చికిత్స కోసం ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం డిశ్చార్జ్ చేశారు.
"నాతో పాటు ఆస్పత్రికి పామును కూడా తీసుకెళ్లాం. అక్కడ అది విషపూరితమైంది కాదని తేలింది. అయినా 6 గంటలపాటు ఆస్పత్రిలోనే ఉన్నా. అన్ని రకాల విరుగుడు మందులు తీసుకున్నా. ఇప్పుడు బాగానే ఉన్నా" అని సల్మాన్ తెలిపారు.
పామును చంపలేదు..
"మేము ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పామును వదిలేశాం. నా సోదరి చాలా భయపడింది. కాబట్టి ఆమె కోసం పాముతో ఓ ఫొటో దిగాను. 'దానితో దోస్తీ కుదిరింది' అని తనకు చెప్పాను." అంటూ నవ్వుతూ చెప్పారు సల్మాన్.
"ఇక మా నాన్న ఏమైంది? పాము బతికే ఉందా? అని అడిగారు. నేను.. 'అవును.. 'టైగర్ బతికే ఉన్నాడు.. పాము కూడా బతికే ఉంది' అని చెప్పా"
- సల్మాన్ ఖాన్, నటుడు
చాలా త్వరగా కోలుకుంటున్న సల్మాన్.. ఆదివారం రాత్రి తన బర్త్‌డే పార్టీని సందడిగా నిర్వహించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపుతున్నారు ఫ్యాన్స్. సోమవారంతో 56 ఏళ్లు పూర్తి చేసుకున్నారు సల్మాన్.
ఇదీ చూడండి: పాము కాటుకు గురైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్