బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ కేసులో ముంబయి పోలీసులు విచారణ చేస్తున్న తీరుపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే మండిపడ్డారు. దర్యాప్తును హీరో బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఎందుకు విచారణ జరపట్లేదని ముంబయి పోలీసులను ప్రశ్నించారు.
అలా దర్యాప్తు చేయండి
"నాలుగేళ్లుగా సుశాంత్ బ్యాంకు ఖాతాలో రూ. 50 కోట్లు జమయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఆ డబ్బంతా విత్‌డ్రా అయ్యింది. ఒకే ఏడాది సుశాంత్ ఖాతాలో అత్యధికంగా రూ.17 కోట్ల జమ అవ్వగా.. అందులో రూ.15 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. దర్యాప్తులో ఇదే కీలకమైన అంశం. దీనిపై ముంబయి పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు" అని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె నిందితురాలు
సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఈ కేసులో పాత్ర ఉందని.. ఫిర్యాదు నమోదైన కారణంగా ఆమె నిందతురాలని డీజీపీ గుప్తేశ్వర్ తెలిపారు. "రియా ఈ కేసులో నిందితురాలు. మేం ఆ సాక్ష్యాలను సేకరిస్తున్నాం. అవి దొరికిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తాం. అయితే దర్యాప్తును పారదర్శకంగా జరుపుతాం. మరిన్ని సాక్ష్యాలు, నిజాలు తెలుసుకోవడంలో భాగంగా మా పోలీసు అధికారులు ముంబయిలో ఉన్నారు" అని గుప్తేశ్వర్ వెల్లడించారు.
బిహార్ సీఎం స్పందన
ముంబయి పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని భావించిన సుశాంత్ తండ్రి కేకే సింగ్.. పట్నా పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన బిహార్ పోలీసులు అనేక విషయాలపై ఆరాలు తీస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును విచారించడానికి ముంబయి వెళ్లిన బిహార్ ఐపీఎస్ ఆఫీసర్ వియన్ తివారీని నిర్బంధించారు. ఈ సంఘటనపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా స్పందించారు. ఆఫీసర్ వినయ్‌ను నిర్బంధించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. దీంట్లో రాజకీయం ఏమీ లేదని, బిహార్ పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని సీఎం తెలిపారు. వినయ్ క్వారంటైన్ అంశాన్ని తమ డీజీపీ ముంబయి అధికారులతో మాట్లాడతారని వెల్లడించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్.