కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు అధికార లాంఛనాల నడుమ ఆదివారం ఉదయం జరిగాయి. కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
పునీత్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, యడియూరప్ప, సిద్ధరామయ్య, నటులు యశ్, సుదీప్, తదితరులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు తెల్లవారు జామున 5 గంటల సమయంలో అంతిమయాత్ర జరిగింది. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకూ భారీ కాన్వాయ్ మధ్య పునీత్ అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
గుండెలవిసేలా విలపించిన శివన్న..
అంత్యక్రియలు ప్రారంభమైన సమయంలో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై.. పునీత్ పార్థివదేహానికి సెల్యూట్ చేశారు. చిన్నప్పటి నుంచి తాను ఎత్తుకొని ఆడించిన, ఇన్నాళ్లు తనకు తోడుగా ఉన్న తన సోదరుడు పునీత్.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడంటూ శివ రాజ్‌కుమార్ గుండెలవిసేలా రోదించారు. మరోవైపు పునీత్ సతీమణి అశ్వినీ, ఇద్దరు పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారి ఆవేదన చూసిన ప్రతిఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.
శుక్రవారం(అక్టోబర్ 29) ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చదవండి: