Prabhas Salar shooting break: ఇటీవలే 'రాధేశ్యామ్'తో అభిమానుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అందులో సలార్ ఒకటి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరుత్సాహ పరిచే వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 'రాధేశ్యామ్' రిలీజ్ తర్వాత ప్రభాస్ ఓ చిన్న సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారు. పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలలు పడుతుందట! అందుకే ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారని టాక్. ఇక ఈ సినిమా విషయాన్ని కొస్తే.. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా 30శాతం వరకు చిత్రీకరణ పూర్తిచేస్తుకుందని తెలుస్తోంది.
Rasikhanna Shocking comments: 'రుద్ర'తో తొమ్మిదేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అక్కడ మొదటి విజయాన్ని అందుకున్నారు నటి రాశీఖన్నా. ప్రస్తుతం 'రుద్ర' సక్సెస్‌తో ఆనందంలో ఉన్న రాశీఖన్నా బాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ‘రుద్ర’ కోసం అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ఇంటర్వ్యూల్లో భాగంగా ఆమె దక్షిణాది చిత్రపరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దక్షిణాదిలో కేవలం నటీమణుల అందాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని సినిమాలు ఆఫర్ చేస్తారని వ్యాఖ్యానించారు.
"దక్షిణాది చిత్రపరిశ్రమలో నటీమణులను గ్లామర్ డాల్, గొప్ప నటి అని విభజించి చూస్తారు. అక్కడ కమర్షియల్ చిత్రాల్లో మంచి పాత్రలే పోషించాను. నేను అందంగా ఉన్నానని, తమ కథలకు సరిపోనని చాలామంది నాకు అవకాశాలు ఇవ్వలేదు. ‘‘పర్వాలేదు. నేను ఆడిషన్స్ ఇస్తాను. ఒక్కసారి చూసి నచ్చితే తీసుకోండి’’ అని అడిగినా వాళ్లు ఒప్పుకోలేదు. అక్కడివాళ్లు లుక్స్‌ని తప్ప టాలెంట్‌ని చూడరు. దాంతో నన్నెవరూ ఒక మంచి నటిగా గుర్తించలేదు. కేవలం ఒకే తరహా పాత్రల్లో నటించాల్సి వచ్చింది. కానీ, నాలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘రుద్ర’తో మంచి అవకాశం వచ్చింది. ఇకపై నా నుంచి అన్నీ విభిన్నమైన చిత్రాలే వచ్చేలా చూసుకుంటా’’ అని రాశీ తెలిపారు. అనంతరం వ్యక్తిగత జీవితం గురించి వస్తోన్న వార్తలపై ఆమె స్పందించారు. ‘‘నేను రిలేషన్షిప్లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలకు సమాధానం చెప్పాలనుకోవడం లేదు. వ్యక్తిగత జీవితాన్ని నేను ఎప్పుడూ ప్రైవేట్‌గానే ఉంచాలనుకుంటాను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే తప్పకుండా చెబుతా" అని రాశిఖన్నా చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి: వాటిని పట్టించుకోను.. నా దృష్టిలో సినిమా అంటే అదే: తారక్