ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మహేశ్ ఆనంద్ అంధేరిలో తన ఇంటిలో శవమై కనిపించారు. 1980లలో ఎన్నో హిందీ చిత్రాలలో ప్రతినాయక పాత్రల్ని పోషించిన నటుడు మృతి చెందడంపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
అతని ఇంట్లో పనిచేసే పనిమనిషి శనివారం యథావిధిగా పనిలోకి వచ్చింది. తలుపు ఎంతకీ తెరవకపోయేసరికి పోలీసులకు సమాచారమిచ్చింది. రెండు రోజుల క్రితమే అతను చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని వెర్సోవా పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు పోస్టుమార్టమ్ తర్వాతే చెప్పగలమన్నారు. అతని ఇంట్లో అనుమానాస్పదంగా ఏం కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు.
అమితాబ్ బచ్చన్‌తో కలిసి గంగా జమునా సరస్వతి, షెహన్షా, లాల్ బాద్షా, తానేదార్, కూలీ నంబర్1, భాఘీలో మహేశ్ ఆనంద్ నటించారు. అతను చివరగా గోవిందా నటించిన 'రంగీలా రాజా' చిత్రంలో కనిపించారు. తెలుగులో నెంబర్ వన్, టాప్ హీరో, బాలు లాంటి సినిమాల్లో నటించారు మహేష్ ఆనంద్.