సిని'మా' ఎన్నికలు(MAA Elections 2021) సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. నటీనటుల తీవ్ర వాదోపదాలతో రోజురోజుకీ 'మా' చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఈసారి అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న నటుడు మంచు విష్ణు(manchu vishnu panel) ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ప్రత్యర్థిగా ఉన్న ప్రకాశ్‌రాజ్ ప్యానల్(prakash panel)పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిలో భాగంగా జీవితపై కూడా విష్ణు ఫైర్ అయ్యారు. జీవిత భర్త రాజశేఖర్ ఇటీవల తన తండ్రిని కలిసి.. ఎన్నో విషయాలు చెప్పాడని విష్ణు చెబుతుండగా.. పక్కనే ఉన్న నరేశ్ 'వద్దు.. ఇప్పుడు ఇవన్నీ చెప్పొద్దు' అని ఆపేశారు.
కాగా, తాజాగా జీవిత(jeevitha rajasekhar MAA) ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మొత్తం వ్యవహారంపై స్పందించారు. రాజశేఖర్.. మోహన్‌బాబుని కలవడానికి గల కారణాన్ని బయటపెట్టారు. "నా భర్త రాజశేఖర్.. మోహన్‌బాబును కలిసిన మాట వాస్తవమే. రాజశేఖర్ కథానాయకుడిగా మేము నిర్మిస్తున్న ఓ సినిమా షూటింగ్ కొన్నిరోజుల నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు తాను షూటింగ్‌కు అరగంట ఆలస్యంగా వస్తానని రాజశేఖర్ నాకు ఫోన్ చేశారు. 'ఎందుకు?' అని నేను అడగ్గా.. 'వచ్చే దారిలోనే మోహన్‌బాబు నివాసం ఉంది కదా. కనుక, ఓసారి ఆయన్ని కలిసి వస్తాను' అని చెప్పారు. దానికి నేను సరే అన్నాను. 'మా' ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాలపై మోహన్‌బాబుతో ఆయన చర్చించారు. అలాగే, చిరంజీవి-మోహన్‌బాబు కుటుంబాల మధ్య 'మా' వేదికగా అధిపత్యపోరు జరుగుతుందని బయట అందరూ చెప్పుకొంటున్నారని.. కాబట్టి, వివాదాలు సద్దుమణిగేలా చూడాలని మోహన్‌బాబుతో ఆయన చెప్పారు. ఇంతకు మించి ఆయన ఏమీ మాట్లాడలేదు" అని జీవిత వివరించారు.
అనంతరం తనని సస్పెండ్ చేస్తానంటూ నరేశ్ చేసిన వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. "ఇటీవల నేను పెట్టిన ప్రెస్‌మీట్‌లో 'ఓటు వేయకండి' అని సభ్యులకు సూచించానని ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేశ్ నన్ను సస్పెండ్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. నేను ఏం తప్పు చేశానని ఆయన నన్ను సస్పెండ్ చేయగలరు? పోస్టల్ బ్యాలెట్‌పై నేను చేసిన మొత్తం వ్యాఖ్యలను వదిలేసి కేవలం 'ఓటు వేయకండి' అని చెప్పిన ఒక్కపదాన్నే పట్టుకుని ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒకవేళ ఆయనే కనుక నన్ను సస్పెండ్ చేయాలి అనుకుంటే చేయమనండి చూద్దాం. ఎందుకంటే ఆ ప్యానెల్ వాళ్లందరూ నన్ను చూసి భయపడుతున్నారు" అని జీవిత అన్నారు.
కాగా, ఈసారి జరగబోయే 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవి కోసం జీవిత పోటీ పడుతున్నారు. మంచు విష్ణు ప్యానెల్‌కు ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.