మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో(maa elections 2021) ఓట్ల లెక్కింపు రోజు రాత్రి పోస్టల్ బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారనే ప్రకాశ్‌రాజ్ ప్యానెల్(prakash raj panel) సభ్యుల ఆరోపణలను 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఖండించారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లను ఒక బాక్స్‌లో లెక్కించనివి మరో బాక్స్‌లో పెట్టి తాళం వేశామని స్పష్టం చేశారు. వాటిని పోలింగ్ కేంద్రంలోనే రాత్రంతా ఉంచామని స్పష్టం చేశారు.
తన చేతిలో ఉన్నవి తాళాలు, ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాసుకున్న కాగితాలు మాత్రమేనని కృష్ణమోహన్ వివరించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ఈసీ సభ్యురాలిగా అనసూయ గెలుపు, ఓటములను కౌటింగ్ రోజు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదని తెలిపారు. సామాజిక మాద్యమాల్లో ఆమె గెలుపుపై వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని కృష్ణమోహన్ చెప్పారు. అనసూయ ఓట్ల లెక్కింపు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు.
28 ఏళ్ల 'మా' చరిత్రలో తాను ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు నిర్వహించానని, ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని కృష్ణమోహన్ తెలిపారు. బుధవారం నుంచి 'మా' అసోసియేషన్‌లో ఎన్నికలకు సంబంధించిన తన పని పూర్తైందని, ఇకపై అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు, తన కార్యవర్గ సభ్యులే 'మా' అసోసియేషన్ కార్యకలాపాలు చూసుకుంటారని వెల్లడించారు.
ఇవీ చదవండి: