బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తాజాగా స్పందించింది. ఇటీవల సైఫ్ కీలకపాత్రలో నటించిన 'తానాజీ' సినిమా విడుదలై... భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. మరాఠి ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలకపాత్ర పోషించిన యోధుడు 'తానాజీ మలుసరే' జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రను పోషించాడు.
స్టార్ హీరో వ్యాఖ్యలు...!
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సైఫ్ అలీఖాన్ ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించాడు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. "తానాజీ సినిమా ఒక చరిత్రకు సంబంధించిందని భావించిడం లేదు. అలాగే ఆంగ్లేయులు రాకముందుకు వరకూ 'భారత్' అనే కాన్సెప్ట్ ఉందని అనుకోవడం లేదు" అని సైఫ్ తెలిపాడు.
అయితే తాజాగా కంగన ఓ వార్తాసంస్థ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె సైఫ్ వ్యాఖ్యలను ఖండించింది. ‘సైఫ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. బ్రిటిష్ వారు మనదేశంలోకి అడుగు పెట్టకముందే ఐక్య భారతదేశం ఉందని మహాభారతం తెలియజేస్తోంది.
" ఆంగ్లేయులు రాకముందు ఐక్య భారతదేశం అనేది లేనప్పుడు మహాభారతం ఏమిటి? 5000 సంవత్సరాల క్రితం రచించిన ఆ మహాకావ్యం ఏం చెబుతోంది? వేద వ్యాసుడు రాసింది ఏమిటి? కృష్ణుడు కీలకపాత్రను పోషించిన ఆ మహాభారతం చాలా గొప్ప కావ్యం" అని కంగనా తెలిపింది.
ఆమె సోదరి రంగోలీ సోషల్‌మీడియా వేదికగా కంగనా మాట్లాడిన ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘సైఫ్‌ను కంగనా చాలా ముఖ్యమైన ప్రశ్నను అడిగింది. సైఫ్ ఇప్పుడు మీ వంతు..’ అని పేర్కొంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'తలైవి' చిత్రంలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శోభన్‌బాబు పాత్రలో విజయ్‌దేవరకొండ, శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు.