అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగనుంది. హీరో సుమంత్ వివాహం నిశ్చయమైంది. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుమంత్ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారు. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. సుమంత్-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లిపత్రిక నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు సుమంత్‌కు హీరోయిన్ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైంది. మనస్పర్థలు తలెత్తడం వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని తమ బంధానికి స్వస్తి పలికారు.
'ప్రేమకథ'తో వెండితెరకు పరిచయమైన సుమంత్ .. 'స్నేహమంటే ఇదేరా', 'సత్యం', 'గోదావరి', 'గోల్కోండ హైస్కూల్' చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస పరాజయాల అనంతరం 'మళ్లీరావా' సినిమాతో పాజిటివ్ టాక్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన 'కపటధారి' మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'అనగనగా ఒక రౌడీ' చేస్తున్నారు.
ఇదీ చూడండి: క్లాసికల్ హిట్ 'గోదావరి' సినిమాకు 15 ఏళ్లు!