ప్రముఖ నృత్యకారిణి డాక్టర్ శోభానాయుడు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు. కళాకారిణితో జరిగిన చివరి సంభాషణను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
"ఉదయం శోభానాయుడు మరణవార్త వినగానే నిర్ఘాంతపోయా. ఆమె గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ఆ స్థాయి కళాకారులు మళ్లీ వస్తారా అనేది ప్రశ్నే. వెంపటి చిన సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా కూచిపూడి నృత్య కళకు కీర్తి తీసుకొచ్చారు. ఆమెతో నాకు వ్యక్తిగతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరినొకరం అభిమానించుకుని.. ప్రశంసించుకునేవాళ్లం."
- చిరంజీవి, కథానాయకుడు
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత శోభానాయుడు నృత్య ప్రదర్శనకు హాజరవ్వాలనుకున్నట్లు చిరంజీవి తెలిపారు. "ఈ మధ్య ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడా చూశా. ఆమె ఆరోగ్యం బాగోలేకపోయినా.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నృత్యం చేశారు. ఆమెకున్న అంకితభావాన్ని అర్థం చేసుకుని.. సంగీత దర్శకుడు కోటి ద్వారా నా శుభాకాంక్షలు తెలిపా. ఆమె కూడా నాకు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు. అదే మా ఇద్దరి మధ్య జరిగిన ఆఖరి సంభాషణ. ఈ గడ్డు కాలం (కరోనా) అయిపోయాక తాను చేయబోయే ప్రదర్శనకు నన్ను, కోటిని ఆహ్వానించారు. వస్తానని చెప్పా. అలాంటి శోభానాయుడు ఈరోజు మనతో లేకపోవడం దురదృష్టకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అంటూ చిరు ఓ ప్రకటన విడుదల చేశారు.