నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-5(bigg boss telugu elimination today) నుంచి అనీ మాస్టర్(bigboss Anee master) ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో చివరిగా అనీ మాస్టర్, ప్రియాంకలు మిగలగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా, టెలివిజన్ షోలలో న్యాయ నిర్ణేతగా అనీ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సెప్టెంబరు 5న మొదలైన బిగ్‌బాస్ షోలో ఐదో కంటెస్టెంట్‌గా ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టారు.
మొదట్లో నెమ్మదిగా ఆడి..
హౌస్‌లోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో అనీ మాస్టర్ అందరినీతోనూ కలివిడిగా ఉండేవారు. ఇంటి సభ్యులతో సౌమ్యంగా, పెద్దరికంతో వ్యవహరించిన ఆమె రోజులు గడిచే కొద్దీ ప్రతి దానికీ అసహనం వ్యక్తం చేసేవారు. పురుషులు బలమైన కంటెస్టెంట్‌లు అని, వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ ఎక్కువగా వాళ్లనే నామినేట్ చేసేవారు. ఎక్కువగా అభద్రతా భావానికి లోనయ్యేవారు. ఇక టాస్క్‌ల సమయంలో జయాపజయాలను సమంగా చూసేవారు కాదు. ఓడిపోతే తీవ్ర ఆగ్రహానికి లోనై గెలిచిన ఇంటి సభ్యులపై చిందులు తొక్కేవారు. తన గేమ్‌కు ఎవరైనా అడ్డుపడితే గట్టిగా అరిచేసేవారు. 'గ్రూప్'గా ఆడటం వల్లే తాను ఓడిపోయానని, కావాలని ఓడించారని మండిపడేవారు. రవి, శ్రీరామ్, అనీ మాస్టర్‌లు ఒకరికొకరు సాయం చేసుకున్నా, దాన్ని ‘గ్రూప్ గేమ్’ అంటే మాత్రం ఒప్పుకోనేవారు కాదు. కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయిన ప్రతిసారీ దిగులుపడిపోయేవారు. ‘నేను హౌస్‌లో ఉన్నంతకాలం ఒక్కసారి కూడా నన్ను కూడా కెప్టెన్ కానివ్వరు’ అంటూ బాధపడేవారు. అయితే, అనూహ్యంగా 10 వారంలో ఆమె ఇంటి కెప్టెన్ అయి, తన కోరిక నెరవేర్చుకున్నారు.
కిచెన్‌లో కింగ్.. కాజల్‌తో ఫైటింగ్
టాస్క్‌ల సమయంలో అరిచినా, గొడవ చేసినా వంట చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎంతో ఓర్పుతో ఇంటి సభ్యులందరికీ వండి పెట్టేవారు. తొలుత సన్నీ, శ్వేతలతో మంచి స్నేహంగా ఉండేవారు. సన్నీ తన కొడుకులాంటి వాడని, శ్వేత కూతురంటూ ఆప్యాయంగా పిలిచేవారు. అయితే, మొదటి నుంచి కాజల్‌ను శత్రువుగా చూసేవారు. ఆమె ఏ చిన్న పని చేసినా తప్పు పట్టేవారు. రోజులు గడిచే కొద్దీ ప్రతివారం ఆమెను నామినేట్ చేసేవారు. తిరిగి కాజల్ నామినేట్ చేస్తే మాత్రం ఒప్పుకొనేవారు కాదు. గట్టిగట్టిగా అరిచేసేవారు. ఆ కోపంలో అనీ మాస్టర్ చేష్టలకు ఇంటి సభ్యులే కాదు, ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయేవారు. ముఖాన నీళ్లు కొట్టుకోవడం, వెక్కిరించడం, హేళనగా మాట్లాడుతూ డ్యాన్స్ చేసేవారు. అదేమంటే ‘నేను అమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదు’ అంటూ తనని తాను సమర్థించుకునేవారు.‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ విషయంలోనూ కాజల్ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఇంటిలో వీరంగం సృష్టించారు. ఈ విషయంలో నాగార్జున సైతం అనీ మాస్టర్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి చురకలు అంటించారు.
ఇదీ చూడండి: బుర్జ్‌ఖలీఫాపై అర్హ బర్త్‌డే పార్టీ.. విదేశీ పర్యటనలో ఎన్టీఆర్