"పెళ్లైన నాయికలకు ఆదరణ అంతగా ఉండదన్న అభిప్రాయం గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. ప్రేక్షకులు.. దర్శక నిర్మాతల ఆలోచనల్లోనూ మార్పులొచ్చాయి. మునుపటితో పోల్చితే ఇప్పుడొస్తున్న కథల్లో మహిళల పాత్రల్ని మరింత బలంగా రాసుకుంటున్నారు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం" అంటోంది నటి ప్రియమణి(Priyamani). 18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అందాల నాయిక ఆమె. కాస్త విరామం తర్వాత ఇప్పుడు 'నారప్ప'తో(Narappa) మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈనెల 20న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Narappa On Amazon Prime) విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఆన్‌లైన్ వేదికగా విలేకర్లతో మాట్లాడింది ప్రియమణి.
'నారప్ప'తో ప్రయాణం ఎలాంటి సంతృప్తినిచ్చింది?
ఇంత మంచి కథలో భాగమైనందుకు, తొలిసారి వెంకటేష్‌తో కలిసి నటించే అవకాశం దొరికినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. అందుకే ఈ చిత్రం కోసం ప్రేక్షకుల్లాగే నేనూ ఆతృతగా ఎదురు చూస్తున్నా. చిత్ర బృందం ఈ సినిమా కోసం నన్ను సంప్రదించక ముందే 'అసురన్' చూశా. నాకు చాలా నచ్చింది. మాతృకలో మంజు వారియర్ లాంటి గొప్ప అనుభవమున్న నటి పోషించిన పాత్రను తెలుగులో నేను చేయగలగడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. నాకు తెలిసి ఆమె చేసిన దాంట్లో ఓ పదిశాతం నేను చేశానని ప్రేక్షకులతో అనిపించుకున్నా.. అంతకంటే గొప్ప ప్రశంస నాకు మరొకటి ఉండదు.
సుందరమ్మగా మీ పాత్ర ఎలా ఉండనుంది?
ఇందులో సుందరమ్మ పాత్ర డీగ్లామర్‌గా బోల్డ్‌గా కనిపిస్తుంది. కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే బలమైన పాత్ర అది.
18 ఏళ్లుగా చిత్రసీమలో ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ గమనించిన మార్పులేంటి?
ఒకప్పుడు కథానాయికలంటే హీరోలతో ఆడిపాడటానికే పరిమితం అనుకునే వాళ్లు. ఇప్పుడూ అలాంటి కమర్షియల్ చిత్రాలు వస్తున్నాయి.. అసలే లేవని కాదు. అయితే ఇటీవల కాలంలో వస్తున్న కథల్లో నాయికల పాత్రల్ని సైతం బలంగా తీర్చిదిద్దుతున్నారు. నటనకు ఎంతో అవకాశం ఉంటోంది. చక్కటి నాయికా ప్రాధాన్య కథల్ని వెండితెరపైకి తీసుకొస్తున్నారు. అలాగే ఓటీటీల్లోనూ మంచి అవకాశాలొస్తున్నాయి. నిజంగా ఈ మార్పు చాలా బాగుంది.
పెళ్లి తర్వాతా సినిమాల పరంగా వేగం చూపిస్తున్నారు. స్ఫూర్తి ఏంటి?
స్ఫూర్తి అనేది ఏం లేదు. దర్శకులు నాకోసం బలమైన పాత్రలు రాసుకుంటున్నారు. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. అందుకే ఈ విషయంలో నేను ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నా. నేను ఇంకా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. అవకాశమొస్తే.. అలాంటి పాత్రలో నటించాలనుంది.
ఇదీ చూడండి.. సుధీర్‌కు రష్మీ ఫోన్.. ఇంట్లో ఎవరూ లేరంటూ!