"నువ్వు ఏ మతం నుంచి వచ్చావు.. నువ్వు ఏమి తింటావు... ఏ భాష మాట్లాడతావు.. నీది ఏ కులం...? ఇవేవీ కాదు... అందరూ కలిస్తే ప్రపంచ కప్పు సాధించొచ్చు" అంటున్నారు కబీర్‌ఖాన్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం '83'. భారత క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్పు విజయం నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. రణ్‌వీర్‌సింగ్... కెప్టెన్ కపిల్‌దేవ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా కబీర్‌ఖాన్ పంచుకున్న సంగతులు...
"గతంలో మన సినిమాల్లో చూపించిన విష పూరిత జాతీయవాదం పట్ల నాకంత సదభిప్రాయం లేదు. జాతీయత వేరు దేశభక్తి వేరు. దేశం పట్ల నీ దేశభక్తిని చాటుకోవడానికి నీకో శత్రువు అవసరం లేదు. నిజమైన దేశభక్తి అంటే ఏంటో '83'లో చూస్తారు. మాతృభూమి గురించి ఎలాంటి నినాదాలు, అనవసర వ్యాఖ్యలు చేయని యువకులు.. దేశమొత్తం గర్వించే పనిచేశారు. అదే ఈ సినిమాకు ప్రధాన అంశం".
"ఒక దేశ జాతీయ వాదాన్ని మరో జాతీయులు ఆనందించకపోవచ్చు. అదే నిజంగా నువ్వు దేశభక్తుడివి అయితే ఆ భావోద్వేగాన్ని ఇతర దేశస్థులూ ఆస్వాదిస్తారు. ఈ సినిమాలో వెస్ట్‌ఇండీస్ కెప్టెన్‌గా నటించిన క్లైవ్ లాయిడ్ ఈ సినిమాలో టీమ్‌ఇండియా ప్రదర్శించిన దేశభక్తిని చూసి చలించి పోయారు. తెరపై తన ప్రత్యర్థి అయినా వాస్తవంగా టీమ్‌ఇండియా దేశభక్తికి ఆయన ముగ్ధుడైపోయారు"
"ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగానే పరిశోధన చేశాం. కొన్ని కీలక సంఘటలను తెరపై ఆకట్టుకునేలా చూపించాలి అనుకున్నప్పుడు స్వేచ్ఛ తీసుకున్నాం. కొంచెం డ్రామాను జోడించాం. కొన్ని సన్నివేశాలు అప్పుడు ఏం జరిగిందో యాథాతథంగా తెరపైకి తీసుకొచ్చాం".
"'83' సినిమాని ఇప్పుడు థియేటర్లో చూసినా ఆస్వాదించగలం. ఒక వారం, నెల తర్వాత అయినా లేదంటే పదేళ్ల తర్వాత చూసినా ఆ అనుభూతి మారదు. సుదీర్ఘ కాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది"
"నేను రివ్యూస్ గురించి సీరియస్‌గా పట్టించుకోను. ఎందుకంటే అవి కొన్ని వర్గాల ప్రేక్షకుల అభిప్రాయాన్నే ప్రతిబింబిస్తాయి. కానీ ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. 'సూర్యవంశీ' విజయం తర్వాత పరిశ్రమకు ఉత్సాహం అందించేలా ఈ చిత్రం ఉందంటున్నారు. అందరికీ ఈ సినిమా నచ్చితే చాలు. బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో అనేది నేను చెప్పలేను. 1983లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు సభ్యులకు నిజమైన నివాళి '83' అని మాత్రం గర్వంగా చెప్పగలను".
"టీమ్ ఇండియా ప్రపంచకప్పు సాధించడానికి ప్రేరేపించిన వివిధ రకాల అంశాల్ని ఇందులో చూపించాం. అప్పుడు టీమ్ ఇండియా సభ్యులు రోజుకి 15 పౌండ్లు భత్యం అందుకునేవారు. ఒక్క మేనేజర్ సాయంతోనే వరల్డ్‌కప్పు మ్యాచ్‌కు ప్రయాణమయ్యారు. అన్ని రకాల కష్టాల్ని అధిగమించి గెలిచారు. సినిమా అంటే కథలోకి ప్రేక్షకుణ్ని తీసుకెళ్లాలి. 1983లో భారత జట్టు వరల్డ్ కప్పు సాధించడానికి పడ్డ కష్టాలు, నష్టాలు, భావోద్వేగాలు... అన్నీ ప్రపంచ కప్పు మ్యాచ్‌లోకి ప్రేక్షకుల్ని తీసుకెళతాయి".
ఇవీ చూడండి:
83 Movie Review: '83'.. సినిమా కూడా గెలిచేసిందా?