ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయింది. అందులో ఇంటర్నెట్తోనే అందరి భవిష్యత్ ముడిపడింది. మనకు ఏది కావాలన్నా.. మనం ఎవరికైనా కావాల్సివచ్చినా అందరినీ అనుసంధానించేది ఇంటర్నెట్. అంతర్జాలం లేకపోతే రోజు గడవని పరిస్థితికి చేరుకుంది ఆధునిక ప్రపంచం. అయితే ఈ ఇంటర్నెట్తో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. మనం ఏదైనా బ్రౌజ్ చేసినా.. సమాచారం వెతికినా.. మనం అంతర్జాలంలో నమోదు చేస్తున్న వివరాలు చోరీ చేయడానికి సైబరాసురులు వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. వీళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి, సురక్షిత ఇంటర్నెంట్ కనెక్షన్, సురక్షిత బ్రౌజింగ్, గోప్యత, థర్డ్ పార్టీ సైట్లను బ్లాక్ చేయడం లాంటి వాటి కోసం ప్రతిరోజు చాలా మంది కోసం వీపీఎన్(Virtual Private Network) సేవలను వినియోగిస్తున్నారు. అయితే వీపీఎన్ల ద్వారా మన ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించే అవకాశం ఉంది. అలా జరగడానికి కారణాలు ఇవే..
డేటాను వీపీఎన్ హోస్ట్ ఎన్‌క్రిప్ట్ చేయడం..
మన డివైజ్ నుంచి ఇంటర్నెట్ ద్వారా వెళ్లే సమాచారం మొత్తాన్ని వీపీఎన్ ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఆ సమాచారం డెస్టినేషన్ చేరిన తర్వాత డిక్రిప్ట్ అవుతుంది. ఎప్పుడైతే వీపీఎన్ ఆస్ చేస్తామో.. అప్పుడు మన డేటా మొత్తాన్ని వీపీఎన్ హోస్ట్ సర్వర్ తీసుకుంటుంది. ఆ తర్వాత మనం బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌కు పంపుతుంది. ఇలా చేయడం ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడానికి ఒక కారణం.
వీపీఎన్ సర్వర్ లొకేషన్..
ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించడానికి.. మీకు, మీ వీపీఎన్ సర్వర్ మధ్య దూరం ఎక్కువగా ఉండటం కూడా ఓ కారణం. సాధారణంగా మనం ఉపయోగించే వీపీఎన్ కంపెనీలు వారి సర్వర్లు ఎక్కడో ఉంటాయి.. ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తాయి. దీంతో మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. దూరం తగ్గితే స్పీడ్ మెరుగవుతుంది.
వీపీఎన్ సర్వర్ లోడ్..
వీపీఎన్ సర్వర్‌పై లోడ్ ఎక్కువ అవడం కూడా ఇంటర్నెట్ స్లో కావడానికి ఓ కారణమే. అదే ఉచిత వీపీఎన్‌లు వాడితే ఇంటర్నెట్ వేగం పడిపోతుంది. ఇంకా లోడ్ ఎక్కువైతే కనెక్షన్ ఆగిపోతుంది. అయితే మనకు సెపరేట్‌గా ఒక ఐపీ అడ్రస్ ఉంటే.. ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా మన డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ఇలాంటి సేవలకు వీపీఎన్ కంపెనీలు ఎక్కువ ఛార్జ్ చేస్తాయి.
ప్రోటోకాల్స్..
ఇంటర్నెట్ వేగం తగ్గడానికి ప్రధాన కారణం ఎన్క్రిప్షన్. అయితే డేటాను ఎలా ఎన్‌క్రిప్ట్ చేయాలో నిర్ణయించేవే ప్రోటోకాల్స్. ఓపెన్ వీపీఎన్ లాంటి పాత ప్రోటోకాల్స్‌ను వాడితే ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. దీని కంటే వైర్గార్డ్, లైట్వే లాంటి ప్రోటోకాల్స్ మెరుగ్గా పనిచేస్తాయి.