యూజర్ల వ్యక్తిగత గోప్యతకు పెద్ద పీట వేస్తూ యాప్‌లో మూడు భారీ మార్పులు చేస్తోంది వాట్సాప్. ఆన్లైన్ స్టేటస్‌ను హైడ్ చేసే వీలు కల్పిస్తోంది. గ్రూప్‌లో ఉన్న ఇతరులకు తెలియకుండా ఎగ్జిట్ అయ్యేలా మార్పులు చేస్తోంది. 'వ్యూ వన్స్' మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసే అవకాశం లేకుండా చేస్తోంది. వీటితోపాటు వాట్సాప్ తెస్తున్న మరికొన్ని కొత్త అప్డేట్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
'ఆన్లైన్' స్టేటస్ కనిపించకుండా..
Whatsapp hide online status : ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేసే వీలు కల్పిస్తోంది వాట్సాప్. మనం ఆన్లైన్లో ఉన్నట్టు అందరికీ కనిపించాలా? లేక మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి మాత్రమేనా? లేక అసలు ఎవరికీ తెలియకుండా చేయాలా? అనే ఆప్షన్స్ ఉండనున్నాయి. ఈ కొత్త అప్డేట్ ఈ నెలలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.
స్క్రీన్‌షాట్ ఇక కుదరదు!
Whatsapp screenshot block : 'వ్యూ వన్స్' ఫీచర్‌ను కొంతకాలం క్రితం అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. అంటే.. మనం పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి చూశాక.. వెంటనే డిలీట్ అయిపోతుంది. అయితే.. అది డిలీట్ అయిపోవడానికి ముందే స్క్రీన్‌షాట్ తీయడం వల్ల.. 'వ్యూ వన్స్' కాన్సెప్ట్‌కే అర్థం లేకుండా పోయింది. అందుకే.. 'వ్యూ వన్స్' మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీయడానికి వీలు లేకుండా చేయనుంది వాట్సాప్. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్.. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో ఇంకా స్పష్టత లేదు. కానీ.. అందుకు ఎక్కువ సమయం పట్టదని వాట్సాప్ సంకేతాలిచ్చింది.
గ్రూప్ నుంచి సైలెంట్‌గా..
Whatsapp group silent exit : ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వస్తే.. ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఫలానా వ్యక్తి ఎగ్జిట్ అయ్యారని గ్రూప్‌లో ఓ మెసేజ్ కనిపిస్తుంది. అప్పుడు అందరి దృష్టి మనపైనే పడుతుంది. అలా జరగకుండా.. సరికొత్త మార్పులు చేస్తోంది వాట్సాప్. సైలెంట్‌గా(ఎవరికీ తెలియకుండా) గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యే వీలు కల్పిస్తోంది. అయితే.. మనం ఎగ్జిట్ అయినట్టు గ్రూప్ అడ్మిన్‌కు మాత్రం తెలుస్తుందని వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ ఫీచర్ ఈ నెలలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
రెండు రోజులు దాటినా 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్'
'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. మొదట.. ఆ ఫీచర్‌ను ఎనిమిది నిమిషాలకు మాత్రమే పరిమితం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు 1 గంట 8 నిమిషాల 16 సెకన్ల వరకు డిలీట్ చేసే అవకాశాన్నిచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను మరింత సమయానికి పెంచుతున్నట్లు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది.
Whatsapp delete for everyone time limit 2022 : కొత్త ఫీచర్ వచ్చాక వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌ను 56 గంటల తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. అంటే రెండున్నర రోజులైనా డిలీట్ చేసేయొచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ మోడ్‌లో ఉంది. మరికొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది.
గ్రూప్‌లో మన నంబర్ కనిపించకుండా..
వాట్సాప్‌లో రకరకాల గ్రూప్‌లలో మనం సభ్యులుగా ఉంటాం. వాటిలో ఉన్నవారిలో చాలా మంది మనకు తెలియని వారు కావచ్చు. అలాంటి వారికి గ్రూప్ ఇన్ఫో చూడడం ద్వారా మన ఫోన్ నంబర్ తెలిసిపోతుంది. ఇకపై అలా జరగకుండా వాట్సాప్ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. గ్రూప్‌లో మనం సభ్యులుగా ఉన్నా.. మన నంబర్ ఇతరులకు కనిపించకుండా చేస్తున్నట్లు తెలిసింది.
Whatsapp group hide numbers : ఈ ఫీచర్ వస్తే.. గ్రూప్‌లోని సభ్యులకు డిఫాల్ట్‌గానే మన నంబర్ హైడ్ అయి ఉంటుంది. మనకు నచ్చితేనే.. నంబర్ కనిపించేలా మార్పులు చేసుకోవచ్చు. అది కూడా.. అందరికీ కాకుండా, గ్రూప్‌లోని కొద్దిమందికి మాత్రమే కనిపించేలా చేయవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు.