- What is the second brain: ఇంట్లో వంట చేసేటప్పుడు ఆఫీసు పనికి సంబంధించి అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఆఫీసుకు వెళ్లగానే దాని సంగతి చూడాలి అనుకుంటాం... తీరా వెళ్లాక ఎంత ప్రయత్నించినా అదేమిటో గుర్తు రాదు.
- సరకులు తీసుకోవాలని దుకాణానికి వెళ్తారు. ఏమేం తేవాలో రాసుకోమంటే 'నాలుగే కదా గుర్తుంటాయిలే' అని ధీమాగా వెళ్లి తెమ్మన్నవి రెండూ అక్కర్లేనివి రెండూ తేవడమూ చాలామందికి అనుభవమే.
- పుస్తకం చదువుతుంటే మంచి వాక్యాలు కనపడ్డాయి. రాసిపెట్టుకోటానికి పక్కన పెన్నూ పేపరూ లేవు. చదవడం ఆపి లేచి వెళ్లి తెచ్చుకునే మూడ్లేదు. పుస్తకం పూర్తయ్యేసరికి ఆ వాక్యాల సంగతే మర్చిపోతాం.
- బుజ్జిగాడి బర్త్ సర్టిఫికెట్‌ని చాలా భద్రంగానే దాచినట్టు గుర్తు. తీరా అవసరమైనప్పుడు జుట్టు పీక్కున్నా ఎక్కడ పెట్టిందీ గుర్తు రాదే.
ఇలాంటి సంఘటనలు ఎన్నో మనకి నిత్యజీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. గుర్తు చేసుకోవడంలో, వెతకడంలో ఎంతో సమయమూ శ్రమా వృథా అవుతుంటాయి. ఏ విషయాన్ని అయినా మర్చిపోకుండా ఉండాలంటే రాసి పెట్టుకోవాలి. అందుకోసం ఎప్పుడూ ఒక పుస్తకమూ పెన్నూ అందుబాటులో ఉంచుకోవాలి. పాతరోజుల్లో కొందరు అలాగే చేసేవారు. కానీ చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక పెన్నూ పేపరూ పక్కకెళ్లిపోయాయి. సరే, ఫోనులోనే నోట్‌ప్యాడ్ ఉందిగా, అందులో రాసి పెట్టుకోవచ్చు. మరి...
ఏ కూరగాయలు కోస్తున్నప్పుడో, కారు నడుపుతున్నప్పుడో మెరుపులా వచ్చిన ఆలోచనని అక్షరాల్లో పెట్టాలంటే..? కూరలు తరగడం ఆపి వెళ్లి రాసుకుంటూ కూర్చుంటే సమయానికి వంట అవదు. నడిరోడ్డుమీద కారునూ ఆపలేం. అందుకే... ఎంత స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నా ఇంకా కొన్ని పనులు చేయలేకపోతున్నాం... అనిపించింది కొందరు ఔత్సాహికులకు.
ఫోనులో అలెక్సా, సిరి లాంటి అసిస్టెంట్లు ఉన్నట్లు ఇంట్లోనూ ఆఫీసులోనూ అసలు అనుక్షణం మనని అంటిపెట్టుకుని ఓ అసిస్టెంటు ఉంటే... మన ఆలోచనను నోటిమాటగా చెబితే రాసేసుకుని భద్రంగా దాచిపెట్టి మనకు కావలసినప్పుడు వెతికి తెచ్చి చూపిస్తే... ఎంత బాగుంటుందీ- అనుకున్నారు. వెంటనే ఆచరణలో పెట్టేశారు. డిజిటల్ బ్రెయిన్‌ని తయారుచేసేశారు. దాన్నే 'సెకండ్ బ్రెయిన్' అంటున్నారు.
ఏమిటీ సెకండ్ బ్రెయిన్?
పేరుకే ఇది సెకండ్ బ్రెయిన్ కానీ దీనికీ మన మెదడుకీ ఏమీ సంబంధం లేదు. చిప్లాగా మన ఒంటిమీద అతికించుకునేదీ కాదు. మరేమిటీ అంటే- అదొక డాక్యుమెంట్. 'ఓస్ అంతేనా...' అనకండి. అది మెదడు చేస్తున్న పనినే చేస్తుంది. మనం చెప్పిన విషయాలన్నిటినీ గుర్తుంచుకుంటుంది, వాటిని ఓ పద్ధతిలో సర్దుతుంది, అవసరమైనప్పుడు గబుక్కున తీసిస్తుంది. మన ఆలోచనల్నీ ఐడియాల్నీ పొందిగ్గా ఒకచోట భద్రపరుస్తుంది. ఇందుకు డిజిటల్ టూల్స్‌ని వినియోగిస్తున్నాం కాబట్టి దాన్ని 'డిజిటల్ బ్రెయిన్' అనీ, మెదడుకి సాయంగా అది చేయాల్సిన పనిని కొంతవరకూ చేస్తోంది కాబట్టి 'సెకండ్ బ్రెయిన్' అనీ అంటున్నారు.
ఎలా పనిచేస్తుంది?
కంప్యూటర్లో డ్రైవ్ నిండిపోయినప్పుడు మిగిలిన సమాచారాన్ని హార్డ్ డిస్క్‌లో విడిగా దాచుకుంటాం కదా. అలాగే ఇది కూడా. కాకపోతే హార్డ్ డిస్క్‌లో అన్నిటినీ వేర్వేరు ఫోల్డర్లుగా మనమే ఆర్గనైజ్ చేసుకోవాలి. కావాల్సినప్పుడు వెతుక్కోవాలి. డిజిటల్ బ్రెయిన్ ఆ పనులన్నీ స్వయంగా చేసుకుంటుంది. ఉదాహరణకి- సామాజిక మాధ్యమాల్లోకి లాగిన్ అవ్వాలన్నా, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలన్నా, ఈ-పేపర్లు చదవాలన్నా, ఈ-మెయిల్, డ్రైవ్ లాంటివి వాడుకోవాలన్నా... అసలు తెల్లారి లేస్తే మనకి ప్రతి పనికీ ఓ పాస్వర్డ్ తప్పనిసరి. పైగా భద్రత కోసం వాటిని తరచూ మార్చుకోవాలి. ఏ పాస్వర్డ్ దేనిదో ఎలా తెలుస్తుంది. ఎన్నని బట్టీ పట్టి గుర్తుపెట్టుకోగలం.
మనిషి మెదడు ప్రధానంగా సొంతంగా ఆలోచించడానికి తయారైంది కానీ, కేవలం యాంత్రికంగా బట్టీపట్టి చెప్పడానికి కాదు. అందుకే అలాంటి పని అంతా ఈ డిజిటల్ బ్రెయిన్‌కి అప్పజెబుతామన్నమాట. ఇది ఒక ఆప్ రూపంలో ఉంటుంది. సేకరించిన సమాచారాన్ని క్లౌడ్‌లో దాచిపెడుతుంది. పాస్వర్డులు, సరకుల లిస్టు, స్క్రీన్షాట్లు, ఫొటోలు, రిమైండర్లు, ఐడియాలు, అనుభూతులు, ఓ వ్యాసమో కథో రాసుకోవడానికి సేకరించుకున్న సమాచారం... అన్నిటినీ అప్పటికప్పుడు చేతిలో పని చేసుకుంటూనే ఒక వాయిస్కమాండ్తో ఈ ఆప్‌లోకి పంపించేయొచ్చు. విషయాన్ని బట్టి ఆ సమాచారాన్ని ఎక్కడ ఎలా స్టోర్ చేయాలో అదే చేసుకుంటుంది. మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఎక్కడ దొరుకుతుంది?
చాలా ఆప్స్ ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. నోషన్, ఎవర్‌నోట్, వన్‌నోట్, ఆబ్సిడియన్, మెమ్... వాటిలో కొన్ని. చాలావరకూ వీటిని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్నిటికి నెలకింతని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ దాదాపు ఒకేలాగా పనిచేస్తాయి. అందులోకి లాగిన్ అయ్యాక మన నోటి నుంచి వెలువడే ప్రతి చిన్న సమాచారాన్నీ భద్రంచేస్తాయి. కంప్యూటర్ తెర మీద ఒక పుస్తకం చదువుతున్నారు, అందులో నచ్చిన పేరాగ్రాఫ్‌ని స్క్రీన్‌షాట్ తీసి ఆప్‌కి మెయిల్ చేయొచ్చు. అద్భుతమైన జలపాతాన్ని చూశారు.
మీకు కలిగిన అనుభూతిని మాటల్లో పెడితే అది ఆటోమేటిగ్గా అక్షరరూపం సంతరించుకుని శాశ్వతంగా అక్కడ పడిఉంటుంది. తర్వాత ఏ ట్రావెలాగో, బ్లాగో రాసుకోవాలనుకున్నప్పుడు ఆనాటి అనుభూతిని ఉన్నదున్నట్లుగా తీసుకుని వాడుకోవచ్చు. సినిమా చూస్తున్నారు, ఒక డైలాగ్ నచ్చింది- వెంటనే ఆప్‌లో రికార్డు చేసేయడమే. ఇదీ అదీ అనికాదు- ఫొటోలు, ఎక్సెల్ షీట్లో తయారుచేసుకున్న సమాచారం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్... అన్నీ అక్కడ దాచుకోవచ్చు. తిరిగి ఆ సమాచారాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు సంబంధించిన 'కీ వర్డ్స్' కొడితే చాలు... ఆ అంశానికి సంబంధించిన సమాచారం ఎప్పుడెప్పుడు ఏయే రూపంలో దాచుకున్నా క్షణంలో అంతా ఒక్కచోట చేరి కళ్లముందు కన్పిస్తుంది. అచ్చంగా మనకోసం మనం తయారుచేసుకున్న ఆన్లైన్ లైబ్రరీలాగా అన్నమాట. కొన్ని ఆప్‌లు సమయాన్నీ స్థలాన్నీ కూడా రికార్డు చేస్తాయి. దానివల్ల ఆయా ఆలోచనల నేపథ్యమూ తెలుస్తుంది.
దీనివల్ల లాభమేంటి?
నాలెడ్జ్ మేనేజ్మెంట్కి ఇది చాలా అవసరం- అంటారు దీన్ని అభివృద్ధి చేసిన పరిశోధకులు. దీనివల్ల మెదడు మీద భారం తగ్గుతుందన్నది వారి వాదన. వ్యక్తిగత, వృత్తిగత బాధ్యతలతో తలమునకలయ్యేవారు ఒకే సమయంలో ఎన్నో పనులు చేయాల్సివస్తుంది. దాంతో ముఖ్యమైన విషయాలను మర్చిపోవచ్చు. అలాగే ఒత్తిడి వల్ల క్లిష్టమైన సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. అలాంటివారికి ఈ సెకండ్ బ్రెయిన్ ఎంతో ఉపయోగకరం- అంటున్నారు పరిశోధకులు. వారేం చెబుతున్నారంటే-
- ఒత్తిడీ ఆందోళనా తగ్గుతాయి, సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.
- ముఖ్యమైన అంశాలను మర్చిపోయే ప్రమాదం ఉండదు.
- ఎక్కువ విషయాలను గుర్తు పెట్టుకోనక్కరలేదు కాబట్టి చేస్తున్న పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.
- సమాచారమంతా ఆర్గనైజ్డ్గా ఒకేచోట ఉన్నప్పుడు వెతుక్కునే శ్రమ తప్పుతుంది. సమయమూ మిగులుతుంది.
- కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.
- అవసరమైనవన్నీ భద్రంగా అందుబాటులో ఉండటం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
వృత్తి ఉద్యోగాల్లో పెద్ద లక్ష్యాలను సాధించడానికి దారి ఏర్పడుతుంది. తెలివితేటల్నీ, నైపుణ్యాల్నీ ఉపయోగించి కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకోవచ్చు.ఆప్లే కాదు, సొంతంగా డిజిటల్ బ్రెయిన్‌ని తయారుచేసుకోవడమెలాగో, దాన్ని ఉపయోగించుకోవడమెలాగో నేర్పించే కోర్సులూ వచ్చాయి. వాటివల్ల ఉత్పాదకతా వృత్తి నైపుణ్యాలూ పెరుగుతున్నాయనీ చెబుతున్నారు.
అదెలా?
ఇది పోటీ ప్రపంచం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వృత్తికి సంబంధించిన సమాచారంలో అప్టుడేట్గా ఉండటానికి డిజిటల్ బ్రెయిన్ తోడ్పడుతుంది కాబట్టి కాస్త ప్రయత్నించి దాన్ని తయారుచేసుకుంటే మేలే కానీ నష్టం లేదన్నది ఈ ఆప్ తయారీదారుల అభిప్రాయం. వృత్తికీ హాబీకీ సంబంధించిన సమాచారం అంతా ఒకచోట ఉంటే సమయం దొరికినప్పుడు దాన్ని ఒకటికి రెండుసార్లు జల్లెడ పడితే అందులో నుంచే ఐడియాలు రావచ్చు. సృజనాత్మకత అంటే గాలిలోంచి పుట్టదు, ఏదో ఒక ఆధారం ఉండాలి. అప్పుడే దాన్నుంచి కొత్త ఆలోచనలు చేయవచ్చు... అంటారు వారు. అందుకేనేమో 'బిల్డింగ్ ఎ సెకండ్ బ్రెయిన్: ఎ ప్రూవెన్ మెథడ్ టు ఆర్గనైజ్ యువర్ డిజిటల్ లైఫ్ అండ్ అన్‌లాక్ యువర్ క్రియేటివ్ పొటెన్షియల్' పేరుతో వచ్చిన పుస్తకం వాల్‌స్ట్రీట్ జర్నల్ బెస్ట్ సెల్లర్ అయింది.
నిజానికి ఇప్పటికే చాలామంది రకరకాల ఆప్‌లను వాడుతున్నారు. చక్కటి సంగీతంతో నిద్రలేపే ఆప్ మొదలుకొని గంటకోసారి లేచి నిలబడమనీ, నీళ్లు తాగమనీ, మందులు వేసుకోమనీ, మీటింగ్ టైమ్ అయిందనీ... గుర్తు చేసే ఆప్‌ల వరకూ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడీ డిజిటల్ బ్రెయిన్ వాటన్నిటి స్థానాన్నీ భర్తీ చేయవచ్చు.
ఇలాంటి పని ఆఫ్‌లైన్‌లో చేయలేమా?
చేయొచ్చు. ఒకప్పుడు ప్రతి ఆఫీసులోనూ ఫైళ్లు గుట్టలు గుట్టలుగా పడివుండేవి. వాటిల్లోనుంచి అవసరమైనది వెతుక్కునేసరికి తాతలు దిగి వచ్చినంత పనయ్యేది. సమాచారాన్ని భద్రపరచడమూ తిరిగి వెతుక్కోవడమూ రెండిటికీ సమయం వృథానే. సాఫ్ట్‌వేర్‌తో ఆ పని కొంత సులువయింది. ఇప్పుడు డిజిటల్ బ్రెయిన్ మరింత సులువుచేయనుంది.
మరి సైన్స్ ఏమంటోంది?
సైన్సు ప్రకారం మనిషి మెదడు చాలా శక్తిమంతమైనది. ఎంత అంటే ఉదాహరణకు- మొట్టమొదటి ఐఫోను స్టోరేజ్ సామర్థ్యం కేవలం 16 జీబీ. ఇప్పుడు దాన్ని ఒక టీబీ(టెరా బైట్- వెయ్యి జీబీ) దాకా పెంచుకునే అవకాశం ఉంది. అలాంటిది మన మెదడులో 2.5 పెటాబైట్ల (ఒక పెటాబైట్ అంటే వెయ్యి టెరాబైట్స్- పది లక్షల జీబీ) సమాచారాన్ని నిల్వ చేయవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే- 300 ఏళ్లపాటు టీవీలో నిరంతరాయంగా ప్రసారాలు నిర్వహించటానికి ఎంత సమాచారం అవసరమో అంత సమాచారం మన మెదడులో పడుతుందన్నమాట. కాబట్టి ఫోనులోనో కంప్యూటర్లోనో స్టోరేజ్ అయిపోయినట్లుగా- మనిషి జీవితకాలంలో మెదడులో చోటు అయిపోవడమన్న ప్రశ్నే రాదు. అలాంటి మెదడుని సరిగ్గా ఉపయోగించుకుంటే అసలు ఆప్స్‌తో పనీ లేదు. అనవసరంగా వాటిమీద ఆధారపడడం మనం తయారుచేసుకున్న సాంకేతికత ముందు మనని మనం తక్కువ చేసుకోవడమే- అంటారు కొందరు పరిశోధకులు.
కానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది ఈ ఆప్‌లను వాడుతున్నారు. దానివల్ల ఫలితం ఉందని భావిస్తున్నారు. దానికి శాస్త్రవేత్తల సమాధానమేమిటంటే- ఇక్కడ సమస్య మెదడు సామర్థ్యంతో కాదు... తగ్గిపోతున్న మన ఏకాగ్రత. మెదడుని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం. అవసరమైన విషయాల మీద అవసరమైనంత శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే అన్నీ మర్చిపోతున్నాం. ఇరవై నాలుగ్గంటలూ ఏదో ఒక విషయం మన బుర్రను తొలిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చదువూ ఉద్యోగాల నుంచి ఒక్క నిమిషం విశ్రాంతి దొరికినా ఖాళీగా ఉండకుండా ఫోను వాడుతుంటాం. టీవీ చూస్తుంటాం. వాటి ద్వారా రకరకాల సమాచారాన్ని మెదడులోకి పంపిస్తూనే ఉంటాం. అందులో పనికొచ్చేది ఎంత, పనికి రానిది ఎంత, దేన్ని భద్రపరచాలీ దేన్ని తొలగించాలీ అన్నది నిర్ణయించు కోవడానికి మెదడుకి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు చేసే పని అదే. కానీ రాత్రి పన్నెండూ ఒంటిగంట దాకా సినిమాలూ సోషల్‌మీడియాలతో కాలం గడిపి ఏ నాలుగ్గంటలో నిద్రపోయి మళ్లీ పొద్దున్నే హడావుడిగా ఉద్యోగానికి వెళ్తే మెదడు సమర్థంగా ఎలా పనిచేయగలుగుతుందీ, ఉన్న మెదడుని ఉపయోగించుకోకుండా అదనపు మెదడు మీద ఆధారపడడం అవసరమా- అన్నది వీరి వాదన. డిజిటల్ బ్రెయిన్‌కి అలవాటుపడిపోతే పరిస్థితి ఇంకాస్త దిగజారవచ్చనీ హెచ్చరిస్తున్నారు.
అలాకాదు, డిజిటల్ బ్రెయిన్ ఉంటే మరింత బాగా రాణిస్తాం- అనుకునేవాళ్లకి శాస్త్రవేత్తలు చెప్పే సలహా ఏంటంటే- రోజువారీ దినచర్యని సులభతరం చేసే సరకుల లిస్టూ, పాస్వర్డులూ లాంటివి రాసుకోడానికీ, ఆఫీసు పనికి అవసరమయ్యే సమాచారాన్ని భద్రం చేసుకోడానికీ దాన్ని వాడొచ్చు కానీ పూర్తిగా డైరీ రాసినట్లు అన్ని విషయాలూ అందులో తోసేసి నూరుశాతం దానిపై ఆధారపడడం మాత్రం మంచిది కాదు. మనిషి మెదడుకి ఇష్టమైన పని- సొంతంగా ఆలోచించడం. దానికి ఆ పనే ఇవ్వాలి, అందుకు పరిమితి లేదూ... అని!
మెదడుకి ఏం కావాలి?
మెదడుని ఆరోగ్యంగా ఉంచుకుంటే జ్ఞాపకశక్తీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమూ పెరుగుతాయి. అందుకని ఆరోగ్యకరమైన మెదడు కోసం ఏం చేయాలంటే...
- మనిషి మెదడు 75 శాతం నీరే. ఏ కొంచెం డీహైడ్రేషన్ అయినా మెదడు పనితీరు మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఆ సమస్య రానీయకూడదు.
- పీల్చుకునే గాలిలోనూ శరీరంలో ఉన్న రక్తంలోనూ 20 శాతం మెదడే తీసుకుంటుంది. ఒక్క ఐదు నిమిషాలు ఆక్సిజన్ అందకపోయినా మెదడులో కొన్ని కణాలు చనిపోతాయి.
- శరీరంలోని కొలెస్ట్రాల్‌లో నాలుగో వంతు మెదడులోనే ఉంటుంది. అక్కడ ప్రతి కణానికీ కొవ్వు అవసరం. అది లేకపోతే కణాలు చచ్చిపోతాయి. ఆహారంలో ఒమేగా-3 కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటున్నందున మెదడు కుంచించుకుపోయే ప్రమాదం పెరుగుతోంది. లో ఫ్యాట్ డైటింగ్ చేసేవాళ్లు వైద్యుల్ని సంప్రదించకుండా ప్రయోగాలు చేయకూడదు.
- జీపీఎస్ ఉందిగా అని ఎక్కడికైనా వెళ్లిపోతున్నాం కానీ దానివల్ల మెదడుకి దిక్కుల్ని గుర్తించే శక్తి సన్నగిల్లుతోందట. మెదడుకి పని తగ్గించడం మొదలుపెడితే కావాలనుకున్నప్పుడు మళ్లీ పనిచేయడం జరగదు. మెదడుకి తగినంత పని ఇవ్వడమే కాదు, శారీరక వ్యాయామం ద్వారానూ మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలి.
- కూరగాయలూ పండ్లతో కూడిన సమతులాహారం మెదడు ఆరోగ్యానికి అవసరం. బీపీ, షుగర్ లాంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.
- నిద్రలేమి, కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన... మెదడు పనితీరును బాగా దెబ్బతీస్తాయి.
ఇదీ... మన బ్రెయిన్ పవర్!
ఏమీ గుర్తుండడం లేదు, ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతోంది, నొప్పితో తల పగిలిపోతోంది... లాంటి మాటలు తరచూ వింటుంటాం. వాస్తవానికి ఇవన్నీ అపోహలే. మెదడు వేడెక్కడం అంటే అలసిపోవడమే. చాలినంత నిద్రే దానికి పరిష్కారం. ఇక, మెదడులో నొప్పి తెలిసే కణాలే ఉండవు.
మనిషి మెదడు ఒక అద్భుతమైన సృష్టి. లెక్కలేనన్ని సామర్థ్యాలు దాని సొంతం. మొత్తం నాడీమండలానికి కమాండ్ సెంటర్ అది. మెదడులో వందకోట్ల న్యూరాన్లు ఉంటాయట. ఒక్కో న్యూరాన్ కనీసం వెయ్యి న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ కనెక్షన్లు ట్రిలియన్ దాటిపోతాయి. ఒక న్యూరాన్ ఒక్క జ్ఞాపకాన్ని మాత్రమే స్టోర్ చేయగలిగితే నిజంగానే చోటు సరిపోయేది కాదేమో. కానీ ఒక్కోటీ పలు న్యూరాన్లతో కలిసి ఒకేసారి చాలా విషయాలను గుర్తుపెట్టుకునేందుకు తోడ్పడుతూ మెదడు మెమొరీని పెంచుతోంది. మనం చూసే, వినే, ఆలోచించే సమాచారం అంతా ఈ న్యూరాన్ల ద్వారానే ఎంత వేగంగా మెదడుకి చేరుతుందంటే- నిమిషానికి 400కి.మీ.లకు పైగా. ఫార్ములా వన్ రేసులో కార్లు కూడా అంత వేగంగా ప్రయాణించవు. నిజానికి బ్రెయిన్‌కి మల్టీ టాస్కింగ్ చేతకాదు. అది ఒకసారి ఒక పని మాత్రమే చేయగలుగుతుంది. అయినా మనం చేస్తున్నామంటే కారణం ఈ వేగమే. ఒక పని నుంచి మరో పనికి వేగంగా మారగలగడం వల్లే మల్టీటాస్కింగ్ మనకి అలవాటయ్యింది. అయితే దీనివల్ల నష్టమే కానీ లాభం లేదు, ఏకాగ్రతా జ్ఞాపకశక్తీ ఐక్యూ కూడా తగ్గిపోతున్నాయి అంటున్నారు పరిశోధకులు
నిద్రలోనూ మెదడు మొత్తానికీ పని
'బుర్ర పూర్తిగా ఉపయోగించు' అంటూ ఉంటారు కొందరు. పదిశాతం మెదడునే ఉపయోగిస్తున్నారని జోకులూ వేస్తారు. నిజానికి మెదడులోని ఒక్కో భాగం ఒక్కో పని చేస్తుంది కాబట్టి ఎప్పుడూ ఆఖరికి నిద్రలో కూడా మొత్తం మెదడుని ఉపయోగిస్తూనే ఉంటాం. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోని లేబొరేటరీ ఆఫ్ న్యూరో ఇమేజింగ్ పరిశోధకుల లెక్క ప్రకారం సగటు మనిషి మెదడు నిమిషానికి 48 చొప్పున రోజుకి 70 వేల ఆలోచనలు చేస్తుందట. కళ్లు చూసిన ఒక దృశ్యాన్ని మనం కన్నుమూసి తెరిచే కన్నా తక్కువ సమయంలో బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్ కన్నా 30రెట్లు వేగంగా మెదడు పనిచేయగలదు. అలాగే చాలామంది అనుకుంటున్నట్లుగా మెదడు సైజుకీ తెలివితేటలకీ ఎలాంటి సంబంధం లేదు.