space wastes isro: క్రియాశీల శకలాల తొలగింపు (ఏడీఆర్)ను చేపట్టేందుకు అవసరమైన పరిజ్ఞానాలు, వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చర్యలు చేపడుతోంది. సంక్లిష్టమైన ఈ ఏడీఆర్ పరిజ్ఞానంలో విధాన, న్యాయపరమైన అంశాలూ ఉంటాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల తెలిపారు.
అంతరిక్ష వ్యర్థాలపై సమన్వయం కోసం ఇస్రో తన ప్రధాన కార్యాలయంలో 'స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్‌నెస్ అండ్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్'ను ఏర్పాటు చేసింది. పనిచేస్తున్న ఉపగ్రహాలకు రోదసి శకలాల నుంచి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఇది వీలు కల్పిస్తుంది. రోదసిలోని వస్తువుల గమనాన్ని పరిశీలించడానికి, వాటిని వర్గీకరించడానికి సొంతంగా పరిశీలన కేంద్రాల ఏర్పాటుకూ ఇస్రో కసరత్తు చేస్తోంది.
ఉత్పన్నం కాకుండా: భవిష్యత్‌లో ఇలాంటి అంతరిక్ష వ్యర్థాలు తయారవకుండా చూసేందుకు అధునాతన పరిజ్ఞానాలపై ఇస్రో కసరత్తు చేస్తోంది. స్వీయ భక్షక (సెల్ఫ్ ఈటింగ్) రాకెట్లు, అంతర్థానమయ్యే ఉపగ్రహాల (వానిషింగ్ శాటిలైట్)పై కూడా దృష్టి సారించింది.
ఏమిటివీ?: నేడు రాకెట్లలో ఇంధనాన్ని నిల్వ చేయడానికి భారీ లోహపు ట్యాంకులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి మోసుకెళ్లే ఉపగ్రహాల బరువు కన్నా ఈ ట్యాంకుల బరువు ఎక్కువగా ఉంటోంది. ఇది రాకెట్ సామర్థ్యాన్ని తగ్గిస్తోంది. ఫలితంగా ఎక్కువ రాకెట్లను ప్రయోగించాల్సి వస్తోంది. అంతిమంగా ఇది అంతరిక్ష వ్యర్థాలు పెరగడానికి కారణమవుతోంది.
స్వీయ భక్షక రాకెట్లతో ఈ సమస్య తీరుతుంది. సంప్రదాయ రాకెట్ల తరహాలో వీటిలో ఇంధన ట్యాంకులు ఉండవు. ‘ఆటోఫేజ్ ఇంజిన్’ ఉంటుంది. ఇందులో ఒక కడ్డీని ఏర్పాటు చేస్తారు. దీని వెలుపలి భాగంలో ఘన ఇంధనం, లోపలి భాగంలో.. ఇంధన ప్రజ్వలనకు అవసరమయ్యే ఆక్సిడైజర్ ఉంటాయి. ఇంధనంగా పాలీఇథలీన్ వంటి బలమైన ప్లాస్టిక్‌ను వాడే వీలుంది. ఈ కడ్డీని వేడి ఇంజిన్‌లోకి పంపడం ద్వారా ఇంధనం, ఆక్సిడైజర్ ఆవిరి రూపంలోకి మారుస్తారు. ఇవి దహనక్రియ (కంబషన్) చాంబర్‌లోకి ప్రవహిస్తాయి. అంతిమంగా.. రాకెట్ పైకి దూసుకెళ్లడానికి అవసరమైన శక్తి ఉత్పత్తవుతుంది. అంతేకాదు ఇంధనంలోని తదుపరి భాగాన్ని ఆవిరి చేయడానికి అవసరమైన వేడి కూడా వెలువడుతుంది.
రాకెట్ పైకి వెళ్లే క్రమంలో.. ఈ కడ్డీ కింది నుంచి మండుతూ వెళుతుంది. చివరికి ఇది హారతి కర్పూరంలా కరిగిపోతుంది. దాని ఆనవాళ్లు పెద్దగా ఏమీ మిగలవు. అందువల్ల అవి సముద్రంలో పడిపోవడం గానీ, రోదసిలో వ్యర్థాల్లా మిగిలిపోవడం గానీ జరగదు. ఈ తరహా రాకెట్లతో ఎక్కువ సరకును రోదసిలోకి తీసుకెళ్లవచ్చు. వాహకనౌక పరిమాణాన్నీ కుదించొచ్చు. తద్వారా అంతరిక్ష వ్యర్థాలూ తగ్గుతాయి.
అంతర్థాన ఉపగ్రహాలు తమ జీవితకాలం ముగిశాక.. 'కిల్ బటన్'లేదా ఒక ప్రక్రియ ద్వారా కక్ష్యలోనే మండిపోతాయి. రాకెట్లు ఎగిరేటప్పుడు ఉత్పన్నమయ్యే ఒత్తిడి కారణంగా వాటిలో పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాటిని అప్పటికప్పుడు సరిచేసేందుకు సెల్ఫ్ హీలింగ్ పదార్థాలపైనా ఇస్రో కసరత్తు చేస్తోంది.
ఇదీ చదవండి: మస్క్‌కు సౌర తుపాను దెబ్బ.. బూడిదైన 40 స్పేస్ఎక్స్ ఉపగ్రహాలు