Interstellar Object Hit Earth : అది జనవరి 8, 2014. వేరే నక్షత్ర మండలం నుంచి దూసుకొచ్చిన ఒక శకలం 110 టన్నుల టీఎన్‌టీ శక్తితో పసిఫిక్ మహాసముద్రాన్ని ఢీకొట్టింది. లోపల మునిగిపోయింది. దీని పేరు సీఎన్‌ఈఓఎస్ 2014-01-08. ఇది కచ్చితంగా వేరే నక్షత్ర మండలానికి చెందినదేనని 2019లో గుర్తించారు. అందుకే దీని అవశేషాలను గుర్తించాలని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తోంది. అదే గనక నిజమైతే సౌర మండలం ఆవలి నుంచి వచ్చిన దుమ్ము కన్నా అతిపెద్ద ఖగోళ వస్తువు ఇదే కాగలదని గట్టిగా భావిస్తున్నారు. సీఎన్‌ఈఓఎస్ 2014-01-08 పపువా న్యూ గినియా తీరానికి సుమారు వంద మైళ్ల దూరంలో అర్ధరాత్రి పసిఫిక్ మహా సముద్రంలో పడింది.
హిరోషిమా మీద వేసిన అణుబాంబులో సుమారు ఒక శాతం శక్తిని వెలువరించింది. కేవలం అర మీటరు వెడల్పుతోనే ఉన్నా దీని ప్రత్యేకతే వేరు. మన సౌర మండలంలో గుర్తించిన మొట్టమొదటి ఇతర నక్షత్ర మండల వస్తువుగా ఇది కనిపిస్తుండటం విశేషం. ఎందుకంటే సూర్యుడి నుంచి చూస్తే ఇది సెకనుకు 37.2 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ఇంత వేగాన్ని సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి పట్టి ఉంచలేదు. అంటే వస్తువులను పట్టి ఉంచే స్థానిక వేగం కన్నా ఇది ఎక్కువన్నమాట. పైగా సీఎన్‌ఈఓఎస్ తన ప్రయాణమార్గంలో ఇతర గ్రహాల మార్గాలనూ దాటుకొని రాలేదు. అందువల్ల ఇది సౌర మండలం ఆవల పుట్టుకొచ్చిందేనన్న నమ్మకం బాగా బలపడింది.
సీఎన్‌ఈఓఎస్‌ను అన్వేషించటానికి శాస్త్రవేత్తలు గెలీలియో ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. పెద్ద మంచం సైజు అయస్కాంతంతో శోధించటం దీనిలోని కీలకాంశం. పసిఫిక్ మహా సముద్రం నైరుతి భాగాన బిస్మార్మ్ సముద్రంలోని మ్యానస్ ద్వీపానికి 186 మైళ్ల దూరంలో దీన్ని చేపట్టనున్నారు. చాలా ఉల్కలు అయస్కాంతానికి అతుక్కుపోయేంత ఇనుమును కలిగి ఉంటాయి. మామూలు ఉల్కల కన్నా సీఎన్‌ఈఓఎస్‌లో పెద్దమొత్తంలో ఇనుము ఉండొచ్చని, అందువల్ల దీన్ని అయస్కాంతంతో తేలికగా బయటకు తీయొచ్చని భావిస్తున్నారు. గెలీలియో ప్రాజెక్టు నౌకకు అయస్కాంతాలతో కూడిన పలకను కట్టి, సముద్రం అడుగు వరకు వేలాడ దీస్తారు. ఇది సీఎన్‌ఈఓఎస్ 2014-01-08 చిన్న ముక్కలను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: 'మానవులు విశ్వవ్యాప్తం'.. అంతరిక్ష నివాసానికి నాసా ఏర్పాట్లు.. కీలక ప్రకటన