కొత్త కార్లు కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్! 2023లో మొత్తం 49 కొత్త కార్లు మార్కెట్లో లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో SUV, వాన్, కూపేలు ఉన్నాయి. 29 SUVలు, 6 MUVలు, 8 సెడాన్లు, 2 హ్యాచ్‌బ్యాక్‌లు, 4 కూప్లను 2023లో విడుదల చేసేందుకు ఆయా కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో విడుదల అయ్యే ప్రముఖ కారు మోడళ్లను చూద్దాం.
1. టాటా పంచ్ సీఎన్జీ..
2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో.. 'ఆల్ట్రోజ్ సీఎన్జీ'తో పాటు 'టాటా పంచ్ సీఎన్జీ' కూడా కొత్తగా అరంగ్రేటం చేసింది. ఈ సంవత్సరం చివర్లో భారీ స్థాయిలో టాటా పంచ్ సీఎన్జీ కార్లను కంపెనీ విడుదల చేయనుంది. ఈ కారును 1.2 లీటర్లు ఇంధన సామర్థ్యంతో తయారుచేశారు. ఐదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్లు ఇందులో ఉంటాయి. రెండు సీఎన్జీ ట్యాంక్‌లు ఉండటం ఈ కారు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
2. కియా సోనెట్ సీఎన్జీ..
కియా సోనెట్ సీఎన్జీ కార్ల మోడల్ కూడా కొద్దికాలంలోనే లాంఛ్ కానుంది. ఒక లీటర్ ఇంజన్ సామర్థంలో ఈ కారును రూపొందించింది కంపెనీ. ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి విడుదలైన 'మారుతీ సుజుకీ బ్రీజా సీఎన్జీ'కి.. 'కియా సోనెట్ సీఎన్జీ' కారు పోటీగా నిలువనుంది.
3. హ్యుందాయ్ ఏఐ3..
మరికొద్ది నెలల్లోనే ఈ మైక్రో ఎస్యూవీ కారు మార్కెట్లోకి ఆరంగ్రేటం చేయనుంది. ఇది టాటా పంచ్‌తో పోటీ పడనుంది. దీన్ని 'గ్రాండ్ ఐ10 నియోస్' మోడల్‌కి మాడిఫైడ్ వెర్షన్‌గా తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్యుందాయ్ ఏఐ3ని.. 1.2 లీటర్ ఇంజిన్ సామర్థంతో తయారుచేశారు. ఇది పెట్రోల్‌తో నడుస్తుంది.
4. మారుతీ సుజుకీ జిమ్ని..
2023 మేలో ఈ కారు మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ కారులో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. 1.5 లీటర్.. నాలుగు-సిలిండర్ K15B పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారును రూపొందించారు. కారుకు మొత్తం ఐదు గేర్లు ఉంటాయి. అందులో నాలుగు ఆటో ట్రాన్స్ఫార్మింగ్ గేర్లు ఉంటాయి.
5. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్..
వచ్చే నెలలో ఈ కారును విడుదల చేసేందుకు మారుతి కంపెనీ సన్నాహలు చేస్తోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌ను.. బాలెనో మోడల్ ఆధారంగా కంపెనీ రూపొందించింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో.. లేదంటే ఒక లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారును తయారుచేసే అవకాశాలు ఉన్నాయి.
6. ఎమ్జీ కామెట్..
ఈ కారుకు రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. పట్టణ ప్రాంత వినియోగదారులే లక్ష్యంగా ఎమ్జీ కామెట్ కారును సంస్థ రూపొందించింది. ఈ సంవత్సరం మధ్యలో 'ఎమ్జీ కామెట్' మార్కెట్లోకి విడుదల కానుంది. ఇండోనేసియాలో అమ్మే ఊలింగ్ ఎయిర్ ఈవీ ఆధారంగా ఈ కారును తయారుచేశారు. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు.. 20-25 కిలో వాట్ అవర్ బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఎమ్జీ కామెట్ ప్రారంభ షోరూం ధర పది లక్షల రూపాయలుగా ఉండవచ్చు.
7. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్..
ఈ ఫేస్‌లిఫ్ట్ కియా సెల్టోస్ కారు 2023 సంవత్సరం మధ్యలో లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కారుపై ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షలు సైతం పూర్తయ్యాయి. దీన్ని 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ సామర్ధంతో తయారు చేశారు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ కూడా ఉంది.
8. లెక్సస్ ఆర్ఎక్స్..
మరికొద్ది రోజుల్లోనే ఈ కారు మార్కెట్లోకి విడుదల కానుంది. 2.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ సామర్థంతో ఈ కారును తయారుచేశారు. లేటెస్ట్ డిజైన్, సౌకర్యాలతో ఈ కారును రూపొందించారు. వైర్లెస్ చార్జర్, 14 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి.