స్మార్ట్‌ఫోన్.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. చిన్నా పెద్దా తేడాల్లేకుండా ప్రతిఒక్కరూ విరివిగా వాడేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో మూడేళ్ల వయసున్న పిల్లలకు కూడా ఫోన్ అందుబాటులో ఉంటోంది. నాణేనికి బొమ్మా, బొరుసు ఉన్నట్లే ఏ వస్తువు వినియోగం విషయంలోనైనా మనం దాన్ని ఉపయోగించే తీరును బట్టి మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్ వాడకంలోనూ మంచి, చెడు రెండు అంశాలను గమనించవచ్చు. కొందరు తమ జీవితానికి మంచి బాటలు వేసుకునేందుకు నియంత్రణగా దాన్ని వాడితే మరికొందరు ఫోనే జీవితంలా రోజులో ఎక్కువ సమయం అందులోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో నేటి తరం తల్లిదండ్రులు చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా మన పిల్లలను చెడు మార్గంలో ప్రయాణించమని చెప్పకనే చెప్తున్నాము.
పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారో.. ఏం బ్రౌజ్ చేస్తున్నారో కూడా చూసే సమయం ఉండట్లేదు నేటి తరం తల్లిదండ్రులకు. ఈ క్రమంలో ఫోన్ వినియోగం విషయంలో మీ పిల్లలు చేస్తున్న పొరపాట్లు, తప్పులపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ప్రతి తల్లి, తండ్రిపై ఎంతైనా ఉంది. మరి మీకు తెలుసా మీరు మీ పిల్లలకు ఇచ్చే మొబైల్ గ్యాడ్జెట్స్‌లో వాళ్లు ఏం చూడాలో కూడా మీ చేతుల్లోనే ఉంటుందని. ఎప్పుడూ వారి వెనకాలే ఉండి ప్రతిదీ గమనించలేం గనుక వారి చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చేముందు వాటిల్లో కొన్ని సెట్టింగ్‌లను మార్చి ఇస్తే సరి. పిల్లలు చెడు కంటెంట్ చూడకుండా నియంత్రించే పని మన చేతుల్లోనే ఉంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం..
IOSలో సెట్టింగ్స్ కోసం
- ముందుగా మీ పిల్లల ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి. తర్వాత లిస్ట్‌లో టాప్‌లో ఉండే 'స్క్రీన్ టైమ్'పై క్లిక్ చేయండి.
- 'ఆన్ స్క్రీన్ టైమ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం స్క్రీన్ టైమ్‌కు పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి.
- ఈ స్క్రీన్ టైమ్‌ను సెట్ చేయడం ద్వారా మీ పిల్లలు ఎన్ని నిమిషాలు లేదా ఎన్ని గంటలు ఫోన్‌ను చూడాలనే దాన్ని మీరే వారికి తెలియకుండా ఆదేశించినట్లౌతుంది.
- యాప్ రెస్ట్రిక్షన్స్ (యాప్ పరిమితులు), కంటెంట్, ప్రైవసీ, డౌన్‌టైమ్ షెడ్యూల్ వంటి వివిధ రకాల పరిమితులను కూడా పిల్లల ఫోన్లో సెట్ చేయవచ్చు. వీటి ద్వారా మీ పిల్లలు ఏయే యాప్స్‌ను ఓపెన్ చేయలి? ఏవి ఓపెన్ చేయకూడదు అనే వాటిని కూడా మీరే నిర్దేశిస్తారు. దీంతో మీ పిల్లలు అసభ్యకరమైన వెబ్సైట్ల జోలికి పోకుండా నియంత్రించగలిగిన వారవుతారు.
- మీ పిల్లలు ఏం చూస్తున్నారు అనే విషయాన్ని వారికి తెలియకుండా తెలుసుకోవాలనుకుంటే 'ఫ్యామిలీ షేరింగ్' అనే ఫీచర్‌ను ఎనెబుల్ చేసుకోవాలి. దీంతో మీ ఫోన్ నుంచే ఓ రిమోట్‌లా మీ పిల్లలు చూసే వెబ్ కంటెంట్‌ను, స్క్రీన్ టైమ్ వంటి వివరాలను పర్యవేక్షించొచ్చు.
ఆండ్రాయిడ్ మొబైల్ సెట్టింగ్స్ కోసం
- ముందుగా మీ పిల్లల ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి.
- కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్స్‌ను బట్టి ఈ సెట్టింగ్స్ ఉంటాయి. కొన్నింటంలో 'డిజిటల్ వెల్ బీయింగ్' లేదా 'పేరెంటల్ కంట్రోల్స్' వంటి ఆప్షన్స్‌ను ఉంటాయి వాటిని ఎంచుకోవచ్చు.
- 'డిజిటల్ వెల్ బీయింగ్' లేదా 'పేరెంటల్ కంట్రోల్స్' ఆప్షన్లపై క్లిక్ చేయండి. అనంతరం తదుపరి వచ్చే సూచనలను పాటించండి.
- ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత యాప్ పరిమితులు, కంటెంట్ ఫిల్టర్లు, స్క్రీన్ టైమ్ షెడ్యూళ్లు వంటి వివిధ రకాల పరిమితులను సెట్ చేయవచ్చు. వీటి ద్వారా పిల్లలు ఎటువంటి వెబ్ కంటెంట్ లేదా ఏ రకమైన వెబ్‌సైట్స్ చూడాలి అనే ఆదేశాలను మనమే ఇవ్వగలుగుతాము. ఐఓఎస్ ఫోన్ల లాగానే ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా స్క్రీన్ టైమ్, కంటెంట్ యాక్సెస్ వంటి విషయాలను పర్యవేక్షించొచ్చు.
కంటెంట్ ఫిల్టర్స్‌ను సెట్ చేయండి..
చెడు వెబ్సైట్లు, అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ పోర్టల్‌లు లేదా పలు రకాల పిల్లల ఏకాగ్రతను దెబ్బతీసే యాప్స్‌ను ఈ కంటెంట్ ఫిల్టర్స్ ఆప్షన్ ద్వారా నియంత్రించొచ్చు. వీటి వాడకాన్ని పరిమితం చేసేందుకు కూడా 'పేరెంటల్ కంట్రోల్స్' సహాయపడతాయి. మీ పిల్లల వయసుకు తగ్గట్టు కంటెంట్‌ను మాత్రమే యాక్సెస్ చేసి చూసేలా కూడా ఇందులో సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కంటెంట్ రేటింగ్‌ల ఆధారంగా యాప్ నియంత్రణలను కూడా సెటప్ చేయవచ్చు. తద్వారా మీ పిల్లలు వారి వయస్సుకి తగిన యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసి ఉపయోగించగలరు.
మరో విషయం ఏంటంటే మీ పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లలో గడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే అధిక సమయం అదే పనిగా మొబైల్ స్క్రీన్‌ను చూస్తే కంటి చూపు మందగించడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.