Google passkey login : పాస్వర్డ్లు లేని డిజిటల్ ప్రపంచాన్ని ఊహించుకోగలమా? ఏ ఖాతా ఓపెన్ చేయాలన్నా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిందే! కానీ ఇప్పుడు ఆ అవసరం లేదంటోంది గూగుల్. ఆన్లైన్లో ఖాతాల లాగిన్ కోసం ఆ సంస్థ.. పాస్కీ పద్ధతిని ప్రవేశపెట్టింది. పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే.. ఖాతాల్లోకి లాగిన్ అయ్యే విధంగా పాస్కీ వ్యవస్థను రూపొందించింది. గురువారమే ఈ పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. పాస్‌వర్డ్‌లకు బదులు ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ, పిన్ నంబర్ సాయంతో ఖాతాలను ఓపెన్ చేసుకోవచ్చని చెబుతోంది.
Google passkey support : పాస్కీ పద్ధతికి మారుతున్నట్లు గూగుల్‌తో పాటు యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు 2022లోనే ప్రకటించాయి. అక్షరాలు, నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్ల కలయికతో ఉండే పాస్‌వర్డ్‌లకు స్వస్తి చెప్పేలా పాస్కీ వ్యవస్థకు ఆజ్యం పోస్తున్నట్లు తెలిపాయి. తాజాగా, గూగుల్ ఓ అడుగు ముందుకేసి ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మేజర్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇది అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
ఏంటీ పాస్కీ?
సింపుల్‌గా చెప్పాలంటే.. మొబైల్ అన్‌లాక్ చేసేందుకు మనం బయోమెట్రిక్ ఉపయోగిస్తుంటాం కదా. ఫేస్ ఐడీ, ఫింగర్‌ప్రింట్ లేదంటే పిన్ నంబర్‌తో మొబైల్ అన్‌లాక్ చేస్తుంటాం. ఇకపై ఇదే బయోమెట్రిక్‌తో ఖాతాల్లోకి లాగిన్ అవ్వొచ్చు. ఖాతాదారుడిని తన అకౌంట్లోకి లాగిన్ అయ్యేందుకు అనుమతించే కీనే పాస్కీ అంటారు. తొలిసారి పాస్కీ టెక్నాలజీని ఉపయోగించినప్పుడు రెండు 'కీ'లు జనరేట్ అవుతాయి. ఇందులో ఒక కీ.. యూజర్ డివైజ్‌లో స్టోర్ అవుతుంది. ఇంకో కీ.. ఖాతా సర్వీసు అందించే కంపెనీ సర్వర్లలో ఉంటుంది. సంబంధిత ఖాతాలోకి యూజర్ లాగిన్ అవ్వాలంటే.. తన డివైజ్‌ను బయోమెట్రిక్ ద్వారా అన్‌లాక్ చేయాలి. ఫోన్లో ఉన్న కీ.. సర్వర్‌లో ఉన్న కీతో మ్యాచ్ అయితే లాగిన్ విజయవంతమవుతుంది.
పాస్‌వర్డ్‌లకు పాస్‌కీలకు తేడా ఏంటి?
ఫిడో (FIDO ఫాస్ట్ ఐడెంటికేషన్ ఆన్లైన్) ఆథెంటికేషన్లో భాగంగా పాస్‌కీలు.. పాస్‌వర్డ్‌ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. పాస్‌కీల వల్ల ఖాతాల లాగిన్ ప్రక్రియ పూర్తిగా మారిపోతుంది. ఏ అకౌంట్ కోసమైనా.. పాస్వర్డ్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిసారి పాస్‌వర్డ్‌ను మ్యాన్యువల్‌గా టైప్ చేయాల్సిన అవసరమే రాదు. ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేస్తే సరిపోతుంది. పాస్వర్డ్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఇది తొలగిస్తుంది.
హై సెక్యూరిటీ కూడా..
పాస్‌వర్డ్‌లతో పోలిస్తే పాస్‌కీల సీక్వెన్స్ సుదీర్ఘంగా ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ కూడా ఎక్కువ. డివైజ్‌లోని కీ.. సీక్రెట్‌గా స్టోర్ అవుతుంది. సర్వర్‌లో ఉండే కీ.. సంక్లిష్టమైన సీక్వెన్స్‌తో స్టోర్ అవుతుంది. కేవలం డివైజ్‌లో ఉన్న ప్రైవేట్ కీ మాత్రమే.. సర్వర్‌లోని కీని ఓపెన్ చేయగలుగుతుంది. ఫిషింగ్ వంటి హ్యాకింగ్ ప్రయత్నాలను పాస్కీ వ్యవస్థ నిరోధిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఏ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కూడా బ్రేక్ చేయలేనంత పటిష్ఠంగా ఈ టెక్నిక్‌ను రూపొందించారు.
గూగుల్ అకౌంట్లో పాస్కీ సెట్ చేస్కోండిలా..
Google passkey setup : గూగుల్ ఖాతాను ఇకపై పాస్‌కీతో ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ సెట్టింగ్స్‌ను మార్చుకుంటే సరిపోతుంది.
- ముందుగా myaccount.google.com లోకి వెళ్లండి.
- అందులోని సెక్యూరిటీ ట్యాబ్ ఓపెన్ చేయండి.
- 'How you sign in to Google' అనే సెక్షన్లో 'పాస్‌కీస్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆటోమెటిక్‌గా క్రియేట్ అయిన పాస్‌కీస్ కనిపిస్తాయి
- కిందికి స్క్రోల్ చేస్తే.. క్రియేట్ పాస్కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. బయోమెట్రిక్‌తో ఆథెంటికేషన్ పూర్తి చేస్తే సరిపోతుంది.
ఇకపై పాస్కీ ద్వారా బయోమెట్రిక్ ఆథెంటికేషన్తో గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వొచ్చు. పాస్కీ క్రియేట్ చేసుకున్నప్పటికీ.. సాధారణ పాస్వర్డ్తోనూ లాగిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకటికి మించి డివైజ్‌లు ఉపయోగించేవారు.. ప్రతిసారి ఫోన్ ద్వారానే ఆథెంటికేషన్ పూర్తి చేయాల్సిన పని ఉండదు. ప్రతి డివైజ్‌కు ప్రత్యేక పాస్కీ పెట్టుకోవచ్చు.